
* ముంబై – హౌరా మెయిల్‌కు బెదిరింపులు
దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం పలు విమానాలకు వరుస బెదిరింపులు వచ్చాయి. ముందుగా ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండిగోకు చెందిన రెండు విమానాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
ముంబై నుంచి జెడ్డాకు వెళ్తున్న 6ఇ 56, ముంబై నుంచి మస్కట్‌కు వెళ్తున్న 6ఇ 1275 విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది విమానాలను వెంటనే ఐసోలేషన్ రన్‌వేకు తరలించినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం అన్ని భద్రతా తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.
కాగా, సోమవారం ఉదయం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ119 విమానం 239 మంది ప్రయాణికులతో ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్నది. ఈ క్రమంలో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు రావడంతో సిబ్బంది ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అనంతరం ప్రయాణికులను అంతా దించివేసి.. ఐసోలేషన్ రన్‌వేకు తరలించారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న పలు విమానాలకు ఇవాళ వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే విమానాలకే కాదు, రైలుకు కూడా ఇలాంటి బెదిరింపులే రావడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఉదయం ముంబై – హౌరా మెయిల్ ()కు బాంబు బెదిరింపులు వచ్చాయి.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆఫ్ – కంట్రోల్‌కు మెయిల్ ద్వారా ఓ సందేశం వచ్చింది. అందులో 12809 నంబర్ గల రైలును టైమర్ బాంబుతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు ట్రైన్‌ను జల్గావ్ స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేశారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ కనిపించలేదని సమాచారం. తనిఖీల అనంతరం రైలు తిరిగి గమ్యస్థానానికి వెళ్లినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
కాగా, గత వారం పూరీ – న్యూ ఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపుల కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా రైల్వే స్టేషన్‌లో రైలు మూడు గంటలకు పైగా ఆలస్యం అయ్యింది. రైల్లో పేలుడు పదార్థాలతో అనుమానిత ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, పూర్తి విచారణ అనంతరం అది బూటకమని తేలింది.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ