
మరో మూడు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ప్రధాన అభ్యర్థులు ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచార జోరు పెంచారు. అయితే, ఈ ఎన్నికల వేళ అభ్యర్థులపై దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్‌పై ఇప్పటికే రెండు సార్లు హత్యా ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే.
తాజాగా మూడోసారి అలాంటి ప్రయత్నమే జరగడం ఇప్పుడు ట్రంప్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితుడిని వేం మిల్లర్‌గా (49) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ ప్రెస్‌కార్డ్, ఎంట్రీ పాస్‌తో ర్యాలీలోకి ప్రవేశించిన మిల్లర్ వేదికకు సమీపంలో లోడ్ చేసిన షాట్‌గన్, హ్యాండ్‌గన్, అధిక సామర్థ్యం గల మ్యాగజైన్‌తో తిరుగుతున్నట్లు సీక్రెట్ సర్వీసెస్ గుర్తించింది.
వెంటనే అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనలో ట్రంప్‌కు గానీ, ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి ముప్పూ వాటిల్లలేదని పోలీసులు వెల్లడించారు. కాగా, అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్ అనే వ్యక్తి సమీపంలోని గోడౌన్ మీదినుంచి ఆయనపై కాల్పులు జరిపాడు.
దీంతో ట్రంప్ కుడి చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లింది. ట్రంప్ రక్తమోడుతూనే అమాంతం డయాస్ కిందకు ఒరిగి తనను తాను కాపాడుకున్నారు. నాటినుంచి ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఆ తర్వాత ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. గత నెల 30న పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్ లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ స్టేజ్‌పై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు వేగంగా స్టేజ్ వైపు దూసుకొచ్చాడు. దాదాపు మీడియా పాయింట్ వరకూ వచ్చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
గత నెల 15న కూడా ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం