కెనడా ప్రధానితో ప్రధాని మోదీ భేటీ 

కెనడా ప్రధానితో ప్రధాని మోదీ భేటీ 

ఆసియాన్‌ సదస్సు కోసం లావోస్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడేతో భేటీ అయ్యారు. సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కాసేపు సమావేశమయ్యారని కెనడా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (సిబిసి) తెలిపింది. కెనడియన్‌ ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య విషయంలో భారత్‌ పాత్ర వుందని ట్రూడే ఆరోపిస్తున్నారు. 

ఆ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. 2020లోనే నిజ్జార్‌ను తీవ్రవాదిగా భారత్‌ ప్రకటించింది. ట్రూడే ఆరోపణలు అసంబద్ధమైనవని వ్యాఖ్యానించింది. ఆ సంఘటన జరిగిన దాదాపు ఏడాది తర్వాత వీరి భేటీ చోటు చేసుకుంది. ‘మనం చేయాల్సిన పని ఇంకా చాలా వుంది.’ అని ట్రూడేను ఉటంకిస్తూ సిబిసి న్యూస్‌ పేర్కొంది. 

”మేం ఏం మాట్లాడుకున్నామనే వివరాల్లోకి వెళ్ళాలనుకోవడం లేదు. అయితే కెనడా ప్రజల భద్రత, చట్టబద్ధ పాలనను పరిరక్షించడమనేది కెనడా ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటిగా వుంది. ఆ అంశాలపైనే మేం కూడా దృష్టి కేంద్రీకరించనున్నాం.” అని ట్రూడే ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.  ఖలిస్థాన్ అనుకూల వర్గాలకు ఎటువంటి కట్టడి లేకుండా కెనడాలో స్వేచ్ఛగా పనిచేసేందుకు కెనడా అవకాశం కల్పించడమే రెండు దేశాల మధ్య వివాదానికి దారితీస్తుంది. 

లావోస్‌లో రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగించుకుని ప్రధాని మోదీ స్వదేశానికి బయలుదేరారు. లావోస్‌లో పర్యటన ఫలప్రదమైందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆసియాన్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి భారత్‌ కట్టుబడి వుందని తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి, సంక్షేమం, సుస్థిర అభివృద్ధి దిశగా మనందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం వుందని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.

భారత్‌, ఆసియాన్‌ దేశాల మధ్య సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరిచేందుకు 10పాయింట్ల ప్రణాళికను మోదీ  ప్రకటించారు.  ఆసియా భవితవ్యానికి మార్గనిర్దేశనం చేయడానికి ప్రాంతీయ గ్రూపుతో సంబంధాలు చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో జపాన్‌, న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా, మలేసియా ప్రధానులతో కూడా మోదీ  భేటీ అయ్యారు. యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌, ప్రపంచ ఆర్థిక వేదిక ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ క్లాస్‌ షావబ్‌లతో కూడా ప్రధాని చర్చలు జరిపారు.