భారత సైనికులున్న ఐరాస శాంతి స్థావరంపై ఇజ్రాయెల్‌ కాల్పులు

భారత సైనికులున్న ఐరాస శాంతి స్థావరంపై ఇజ్రాయెల్‌ కాల్పులు
* ఐరాస ప్రాంగణాలను గౌరవించాలని భారత్ హితవు
ఇతర దేశాలతోపాటు భారత సైనికులున్న ఐక్యరాజ్యసమితి శాంతి స్థావరంపై ఇజ్రాయెల్‌ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో అక్కడ మోహరించిన ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షకుల భద్రతపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస ప్రాంగణాలను గౌరవించాలని ఇజ్రాయెల్‌కు సూచించింది.
 
ఈ వివాదం ప్రాంతీయ యుద్ధంగా మారకుండా చూడటం ఎంతో ముఖ్యమని అభిప్రాయ పడింది. తాజా ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్‌, ఇరాన్‌తోపాటు ఇతర పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయులను తరలించే ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని ఐరాస శాంతి పరిరక్షణ కార్యాలయంపై దాడులు జరగడం ఆందోళనకరమని భారత విదేశాంగశాఖ అభిప్రాయపడింది.
 
 ”లెబనాన్‌ సరిహద్దు (బ్లూ లైన్‌)లో భద్రతా పరిస్థితులు క్షీణించడం ఆందోళనకరం. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. ఐక్యరాజ్య సమితి ప్రాంగణాలను అందరూ గౌరవించాలి. ఐరాస శాంతి పరిరక్షకులు, ఆ సంస్థ నిర్ణయాలను గౌరవించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి” అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
 
”పశ్చిమాసియాలో నెలకొంటున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశాం. అక్కడ చోటుచేసుకుంటున్న హింస, పరిస్థితులు ఎంతగానో ఆందోళన కలిగిస్తున్నాయి. సంబంధిత భాగస్వామ్య పక్షాలు సంయమనం పాటించాలని, పౌరులకు రక్షణ కల్పించాలని పునరుద్ఘాటించాం. ఈ ఘర్షణ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకూడదు. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి” అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు.
 
ఐరాస శాంతి పరిరక్షణ మిషన్‌లో భాగంగా లెబనాన్‌లో సుమారు 600 మంది భారతీయ సైనికులు ఉన్నారు. అయితే దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైనిక బలగాలు దాడులు చేస్తున్నాయి. లెబనాన్‌ సరిహద్దులోని 50దేశాల నుంచి దాదాపు 10,500 మందితో కూడిన ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం (యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌) ఉన్న నఖౌరా ప్రధాన కార్యాలయం, ఆ సమీపంలో ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరుపుతున్నది. 
 
గురువారం నాటి దాడుల్లో ఐరాస శాంతి స్థావరంలోని వాచ్‌ టవర్‌ ధ్వంసమైంది. ఈ సంఘటనలో ఇద్దరు సైనికులు గాయపడినట్లు యూఎన్‌ పేర్కొంది. గాయపడిన సైనికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దళాలు ఐరాస శాంతి పరిరక్షకులచే నిర్వహించబడిన మూడు స్థానాలపై కాల్పులు జరిపాయని తెలిపింది.
 
ఆ ప్రాంతంలో తమ బలగాలు పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ అంగీకరించింది.  అయితే, తాము పోరాడుతున్న హిజ్బుల్లా టెర్రర్ గ్రూపుకు చెందిన యోధులు ఐరాస పోస్ట్‌ల దగ్గర పనిచేస్తున్నారని పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్‌ కాల్పుల నేపథ్యంలో శాంతి పరిరక్షకుల భద్రతపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 
 
విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బ్లూ లైన్ వెంబడి క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై మేం ఆందోళన చెందుతున్నాం. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. ఐరాస శాంతి ప్రాంగణాల భద్రతను ఉల్లంఘించకూడదు. వాటిని అందరూ గౌరవించాలి. శాంతి పరిరక్షకుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.
మరోవంక, లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతున్నది. సెంట్రల్‌ బీరూట్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 117 మంది గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. క్షతగాత్రులను అమెరికన్‌ యూనివర్సిటీ ఆసుప్రతికి తరలించారు. ఇక మృతుల్లో ఇద్దరు హిజ్బొల్లా టాప్‌ కమాండర్లు ఉన్నట్లు సమాచారం. 
 
కమాండర్ల మృతిపై హిజ్బొ్ల్లా మీడియా కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇజ్రాయెల్‌ బచౌర ప్రాంతంలోని దాడులకు దిగింది. హిజ్బొల్లా కమాండర్లను హతమార్చడంతో పాటు ఆయుధాలను ధ్వంసం చేసేందుకు దక్షిణ శివారు ప్రాంతమైన దహీమ్‌ వెలుపల నగరంపై వైమానిక దాడులు చేయడం ఇది మూడోసారి.