జ‌పాన్ సంస్థ‌కు ఈ యేటి నోబెల్ శాంతి పుర‌స్కారం

జ‌పాన్ సంస్థ‌కు ఈ యేటి నోబెల్ శాంతి పుర‌స్కారం
అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం కృషి చేస్తున్న సంస్థకు అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. జపాన్​కు చెందిన నిహోన్ హిడంక్యోకు ఈ ఏడాది శాంతి బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. నిహాన్‌ హిడాంక్యో సంస్థ త‌మ అనుభ‌వంతో ప్రజల్లో ఆశ‌, శాంతిని పెంపొదిస్తున్నట్లు క‌మిటీ ప్రశంసించింది.
 
హిరోషిమా, నాగ‌సాకిపై జ‌రిగిన అణుబాంబు దాడిలో దెబ్బ‌తిన్న బాధితుల కోసం నిహ‌న్ హిడంక్యో సంస్థ ప‌నిచేస్తున్న‌ది. నిహ‌న్ హిడంక్యోకు హిబకుషా అనే మ‌రో పేరు ఉన్న‌ది.  న్యూక్లియ‌ర్ ఆయుధాల‌ను మ‌ళ్లీ వాడ‌రాదు అని ఆ సంస్థ ప్ర‌త్య‌క్ష బాధితుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన‌ట్లు  నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ పేర్కొన్న‌ది.
 

త‌మ అవార్డుతో హిరోషిమా, నాగ‌సాకి అణుబాంబు బాధితుల‌ను గౌర‌విస్తున్న‌ట్లు నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.  భౌతిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు, జ్ఞాప‌కాలు వేధిస్తున్నా జ‌పాన్ సంస్థ త‌మ అనుభ‌వంతో ప్ర‌జ‌ల్లో ఆశ‌, శాంతిని పెంపొదిస్తున్న‌ట్లు క‌మిటీ వెల్ల‌డించింది. అణు ఆయుధాల వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని ఆ సంస్థ వివ‌రించ‌గ‌లుతోంద‌ని క‌మిటీ చెప్పింది.నోబెల్ శాంతి బ‌హుమ‌తిని 1901 నుంచి ఇస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 104 సార్లు ఆ పుర‌స్కారాన్ని అందించారు. వ్య‌క్తుల‌తో పాటు సంస్థ‌ల‌కు కూడా నోబెల్ శాంతి పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించారు. గ‌త ఏడాది మ‌హిళల హ‌క్కులు, ప్ర‌జాస్వామ్యం గురించి పోరాడిన ఇరాన్ సామాజిక కార్య‌కర్త న‌ర్గెస్ మొహ‌మ్మ‌దీకి అవార్డును ఇచ్చారు.

ప్ర‌స్తుతం మిడిల్ ఈస్ట్‌, ఉక్రెయిన్‌, సుడాన్‌లో సంక్షిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో శాంతి పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. శాంతి బ‌హుమ‌తిని ఓస్లాలో ప్ర‌క‌టిస్తారు. మిగితా పుర‌స్కారాల‌ను స్టాక్‌హోమ్‌లో వెల్ల‌డిస్తారు. సోమ‌వారం ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్ విజేత‌ను ప్ర‌క‌టిస్తారు. దాంటో అవార్డుల ప్ర‌క‌ట‌న ముగుస్తుంది.