షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ వర్గీకరణ కోసం 2011 నాటి జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో ‘వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం’ మంగళవారం సచివాలయంలో సమావేశమైంది.
ఈ భేటీలో కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, డి.శ్రీధర్‌బాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది.
ఎస్సీల్లోని ఉప కులాల వెనకబాటుతనాన్ని సమగ్రంగా గుర్తించడానికి ఈ కమిషన్ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. వర్గీకరణ ప్రక్రియ ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా చట్టబద్ధంగా ఉండాలని, అందుకే న్యాయ (జ్యుడీషియల్) పరిశీలన అవసరమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ జ్యుడీషియల్ కమిషన్‌కు అవసరమైన ముసాయిదా నియమ నిబంధనలను అడ్వొకేట్ జనరల్ సిద్ధం చేశారని అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు.
ఎస్సీల్లోని ఉప కులాలవారీగా ఉన్న ఉద్యోగుల వివరాలను ఇవ్వాలంటూ ఇప్పటికే టీజీపీఎస్సీ, టీజీఎల్‌పీఆర్‌బీ, ఎస్‌సీసీఎల్, ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీ, ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ వంటి సంస్థలను కోరినట్లు వివరించారు. ఇప్పటికే 30 శాతం వివరాలను ఆర్థిక శాఖ ద్వారా సేకరించినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై మొత్తం 1,082 వినతులు క్యాబినెట్ సబ్ కమిటికీ అందాయి. వీటిని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో స్వీకరించినట్లు వివరించారు. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఎస్సీ వర్గీకరణను ఇప్పటికే రాష్ట్ర బృందాలు అధ్యయనం చేసి వచ్చాయి.
ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి నిర్దిష్ట గడువు ఉండాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే జ్యుడీషియల్ కమిషన్ తప్పనిసరిగా సామాజిక న్యాయాన్ని ప్రతిబింబింపజేయాలని, నివేదికకు న్యాయబద్ధత ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలోనే జిల్లాల పర్యటన చేపడుతుందని, వివిధ మార్గాల ద్వారా సేకరించిన ఎస్సీ ఉప కులాల సమాచారాన్ని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీ్‌స(సెస్) సమీక్ష కోసం పంపిస్తామిని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
కాగా, రాష్ట్రంలోని వెనకబడిన తరగతుల (బీసీ) సామాజిక ఆర్థిక సర్వేను చేపట్టాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బీసీ ఓటర్ల గణనను డిసెంబరు 9లోపు పూర్తి చేయాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ ఓటర్ల లెక్కింపుతో పాటే బీసీల సామాజిక ఆర్థిక సర్వేను కూడా చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు