నాగార్జునపై క్రిమినల్‌ కేసు నమోదు

నాగార్జునపై క్రిమినల్‌ కేసు నమోదు
సినీ నటుడు నాగార్జునపై రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగింది. సమంత- నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు రూ 100 కోట్ల పరువునష్టం దావా వేస్తున్నట్టు హెచ్చరించిన మరుసటి రోజే ఆయనపై కేసు నమోదు చేశారు. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్‌ కన్వెన్షన్‌ కట్టారని మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో నాగార్జునపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. 
 
జనంకోసం అనే సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కినేని నాగార్జునను లక్ష్యంగా చేసుకొంటున్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి. ముందుగా ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ విషయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేసింది. 
 
కోర్టు నుంచి స్టే ఆర్డర్‌ ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా ఎన్‌ కన్వెన్షన్‌ కట్టడాలను కూల్చివేయడంపై అప్పట్లో నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు.  ఆ తర్వాత నాగార్జున ఈ విషయంలో మౌనంగా ఉంటున్నప్పటికీ, ఆయన కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వివాదాస్పద వాఖ్యల పట్ల రాజకీయ వర్గాలతో పాటు మొత్తం సినీ పరిశ్రమ విస్మయం చెందడంతో పాటు ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. 
చివరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ వాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వెల్లడైంది.  ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నాగార్జున మంత్రి సురేఖపై క్రిమినల్‌ కేసు పెట్టడంతో పాటు పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ హద్దులు దాటి మాట్లాడారని, దీనిపై క్షమాపణ చెప్పినా కేసు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ విషయంలో నాగార్జునను కట్టడి చేయడం కోసమే బెదిరింపు చర్యల్లో భాగంగా కేసు పెట్టారని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.