రామప్పకు ‘మైనింగ్‌ విపత్తు’… విధ్వంసమయ్యే ప్రమాదం

రామప్పకు ‘మైనింగ్‌ విపత్తు’… విధ్వంసమయ్యే ప్రమాదం

పచ్చని అడవులు, పక్కన చెరువు.. బంగారం, మట్టి కలగలిపిన రంగులో అలరారే అద్భుత అందాల రామప్ప ఆలయం ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కార్‌ తలపెట్టిన ‘మైనింగ్‌ విపత్తు’తో విధ్వంసమయ్యే ప్రమాదం పొంచిఉన్నది. సామాన్యులు మెచ్చేలా పరిపాలన సాగించిన కాకతీయుల అద్భుత కట్టడంగా నిలిచి, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప పక్కనే సింగరేణి ఆధ్వర్యంలో ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం 2012లోనూ ఈ ప్రాంతంలో ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. చరిత్రకారులు, ప్రజల నిరసనలు, ఆందోళనలతో వెనక్కి తగ్గింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌, కల్చరల్‌ ఆర్గనైజేషన్‌(యునెస్కో) గుర్తింపు ఈ చారిత్రక కట్టడానికి లభించింది.

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలో రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని కాకతీయులు అద్భుత శిల్పాకళా శైలితో నిర్మించారు. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి వద్ద సేనాధిపతిగా పనిచేసిన రేచర్ల రద్రుడు 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ప్రపంచంలోనే గొప్ప కట్టడాల్లో ఒకటిగా దీనికి మూడేండ్ల క్రితం యునెస్కో గుర్తింపు వచ్చింది. ఇలాంటి కట్టడం గురించి ప్రపంచానికి చాటి చెప్పుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, దాని ఉనికినే ప్రమాదంలో పడేసే చర్యలు మొదలుపెట్టింది. 

రామప్ప పక్కనే బొగ్గు ఓపెన్‌ కాస్టు మైనింగ్‌కు అనుమతులిస్తున్నది. భూపాలపల్లిలో ప్రస్తుతం ఉన్న బొగ్గు గనుల ప్రాజెక్టు విస్తరణలో భాగంగా సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రామప్ప ప్రాంతంలోనూ తవ్వకాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భూపాలపల్లిలో ప్రస్తుతం ఉన్న ఓపెన్‌ కాస్ట్‌ (కేటీకే 3) నుంచి 13.6 కిలో మీటర్ల దూరంలో వెంకటాపూర్‌ ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు సింగరేణి ఏర్పాట్లు చేస్తున్నది.

1,088 ఎకరాల విస్తీర్ణంలో 300 మీటర్ల లోతులో బొగ్గు తవ్వకాలు జరిపేలా సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును రూపొందించింది. ఇక్కడ తవ్విన బొగ్గును మరో 737 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్‌ చేయనున్నారు. దీన్ని 120 మీటర్ల ఎత్తులో గుట్టలుగా పోస్తారు. ఇదే జరిగితే ఈ పచ్చని ప్రాంతమంతా కాలుష్యకాసారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. 

అటవీ ప్రాంతమంతా నల్లటి బూడిద, పొగతో నిండిపోతుంది. సమీపంలోనే ఉన్న రామప్పను బొగ్గు, బూడిద, పొగ ముంచెత్తుతాయి. భక్తులు, పర్యాటకులతో కళకళలాడాల్సిన రామప్ప ప్రాంతం, మట్టికొట్టుకుపోయే ప్రమాదమున్నది. ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ కారణంగా ఇక్కడికి పర్యాటకులు రావాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని పురావస్తు నిపుణులు చెప్తున్నారు.

2016లో భూపాలపల్లి జిల్లా భీంగణపురం నుంచి రామప్ప వరకు దేవాదుల నీటిని తరలించేందుకు సొరంగం తవ్వాలని భావించారు. పనుల్లో భాగంగా బ్లాస్టింగ్‌ చేయాల్సిన అవసరం ఉండటంతో రామప్ప ఆలయానికి ప్రమాదం ఉంటుందన్న కేంద్ర పురావస్తు శాఖ సూచన మేరకు అప్పటి ప్రభుత్వం పైపులైన్‌ నిర్మాణంతో దేవాదుల పనులు చేసింది. 

చారిత్రక కట్టడాల సమీపంలో మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ రామప్ప సమీపంలో మైనింగ్‌ కోసం రిపోర్టులను అనుకూలంగా తీర్చిదిద్దుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం రామప్ప కట్టడానికి మైనింగ్‌ ప్రాంతం ఎంత దూరం ఉండాలో అంతే ఉన్నట్టుగా నివేదికలను అధికార వర్గాలు చూపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

పాలంపేటకు ప్రత్యేక అభివృద్ధి అథారిటీ ఉన్నది. ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(ఈపీటీఆర్‌ఐ), నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అనుమతులు వచ్చినట్టు సింగరేణి ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీటిని ఆధారంగా చూపి జిల్లా స్తాయిలోని మైనింగ్‌ కమిటీ ఆమోదం కోసం ఒత్తిడి తెస్తున్నారు. 

రామప్ప సమీపంలో మైనింగ్‌ అనుమతి కోసం ములుగు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే సమావేశం నిర్వహించారు. తర్వాత మీటింగ్‌లో తుదిదశ అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నదని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా చారిత్రక కట్టడాల గుర్తింపుతోపాటు అవసరమైన మేరకు పరిరక్షణ చర్యలు చేపట్టపోతే ఆ గుర్తింపును రద్దు చేసేలా యునెస్కో నిబంధనలున్నాయి. 

రామప్ప ప్రాంతంలో మైనింగ్‌ జరిగితే భవిష్యత్తులో యునెస్కో తీవ్రమైన నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉన్నదని పురావస్తు నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రామప్ప ప్రాంతం ఇప్పు డు అడవిని తలపించేలా ఉంటుంది. ఈ ప్రాంతంలో బొగ్గు తవ్వకాలు మొదలైతే చెట్లు, పరిసరాలు, ఆలయ గోడలు దుబ్బ, మసి కొట్టుకుపోతాయి. పర్యాటకులకు బూడిద కుప్పలే దర్శనమిస్తాయి. 

ఇలాంటి పరిస్థితి వస్తే యునెస్కో మార్గదర్శాల ప్రకారం రామప్ప ప్రాంతం ఉండదు. అప్పుడు రామప్పకు ఉన్న ప్రపంచ స్థాయి గుర్తింపునకే ప్రమాదం ఏర్పడుతుందని పురావస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.  రాజస్థాన్‌లోని ప్రఖ్యాత చిత్తోడ్‌గఢ్‌ కోట దగ్గర లైమ్‌స్టోన్‌ మైనింగ్‌ విషయంలోనూ రామప్ప తర హా పరిస్థితి వచ్చింది. 

ఈ చారిత్రక కట్టడం విషయంలో రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కట్టడానికి 10 కిలో మీటర్ల పరిధిలో ఎలాంటి మైనింగ్‌ చే యవద్దని ఆదేశించింది. ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లడంతో కట్టడానికి ఐదు కిలో మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు వద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అది కోట కాగా ఇది ఆలయం.. పైగా వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా యునెస్కో గుర్తింపు పొందిన కట్ట డం.

 ఒక కోటకు వర్తించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొం దిన చారిత్రక ఆలయానికి వర్తించవా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూసినా రామప్ప సమీపంలో ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనుల తవ్వకంతో ప్రమాదం పొంచి ఉన్నది. అధికారులు ఉద్దేపూర్వకంగా మైనింగ్‌కు అనుగుణంగా దూరాన్ని రూపొందిస్తున్నారు. 

ఎయిర్‌ రూట్‌, రోడ్‌ రూట్‌లో వేర్వేరు దూరాన్ని నమోదు చేస్తున్నారు. మైనింగ్‌ ప్రాంతం నుంచి రామప్ప ఆలయం 4.5 కిలో మీటర్లే ఉన్నది. అనుమతుల కోసం అధికారు లు దీన్ని 5.5 కిలో మీటర్లుగా చూపిస్తున్నారు. అర కిలో మీటరును అనుకూలంగా చేసుకొని రామప్ప వద్ద విధ్వంసం చేసే పనులు చేపట్టడం ఎందుకని చరిత్రకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పేలుళ్లతో 5 కిలో మీటర్లదాకా ప్రభావం ఉంటుందని పరిశోధన సంస్థలు సైతం తేల్చిచెప్తున్నాయి.