‘ఎస్సీ వర్గీకరణ’పై సమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరణ 

‘ఎస్సీ వర్గీకరణ’పై సమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరణ 
ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్డ్‌ కులాల ఉప వర్గీకరణ చేసుకోవచ్చని, ఆ అధికారం రాష్ట్రాలకు ఉందంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 1న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజారిటీతో ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్‌, విక్రమ్‌ నాథ్‌, బేలా త్రివేది, పంకజ్‌ మిత్తల్‌, మనోజ్‌ మిశ్రా, సతీశ్‌చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం.. తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 
 
‘‘పిటిషన్లు అన్నింటినీ పరిశీలించాం. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సిన అవసరం కనిపించలేదు. పిటిషన్లను కొట్టివేస్తున్నాం’’ అని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. గతంలో రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నమైన తీర్పు ఇచ్చిన ఏకైక జడ్జి జస్టిస్‌ బేలా త్రివేది కూడా పిటిషన్ల కొట్టివేతకు మద్దతు తెలపడం విశేషం. 
 
రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తూ గత నెల 24న ధర్మాసనం తీర్పు ఇవ్వగా శుక్రవారం దాన్ని అప్‌లోడ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణకు అవకాశం లేదంటూ 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ ఏడాది ఆగస్టు 1న సీజేఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తోసిపుచ్చింది. 
 
ఎస్సీల రిజర్వేషన్లను వర్గీకరించి, అదే వర్గంలో అత్యంత వెనకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలు కల్పించడానికి పచ్చజెండా ఊపింది. అయితే న్యాయసమీక్షకు లోబడే ఈ వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది. నిర్దిష్ట గణాంకాల ఆధారంగా, అత్యంత వెనకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దాన్ని ఉపయోగించాలని పేర్కొంది. రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటే వాటిని న్యాయస్థానాలు సమీక్షించవచ్చని తెలిపింది.