
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ప్రతిపక్ష కూటములే చేరేందుకు హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తి చూపుతూ ఉండడంతో మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)లో చిచ్చు పెట్టిన్నట్లయింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ రెండూ సానుకూలంగా ఉన్నప్పటికీ. అందుకు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యుబిటి) వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో ప్రతిష్టంభన నెలకొంది.
ఓవైసీ నేతృత్వంలోని పార్టీతో ఏ విధమైన అవగాహనను ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, షెత్కారీ కమ్‌గర్ పక్ష, రిపబ్లికన్ ఆర్గనైజేషన్ వంటి పార్టీలు ఎంవిఎలో భాగమయ్యాయి. అయితే, కూటమిలో ఓవైసీ పార్టీని చేర్చుకునేందుకు యుబిటి ససేమీరా అంటూ అడ్డుపడుతున్నది. ఆ విధంగా చేస్తే శివసేనకు సాంప్రదాయకంగా ఉన్న ఓటర్లు సహింపలేరని, వారంతా ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వైపు వెళ్లిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంకు మహారాష్ట్రలో చెప్పుకోదగిన ఉనికి ఉంది. గత ఎన్నికలలో ఒక లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకుంది. గతంలో రెండు అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకుంది. ఇప్పటికే, కూటమిలో చేరేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ)లు లిఖితపూర్వక ప్రతిపాదనను అందించారు. అయితే థాకరే వ్యతిరేకత కారణంగా ఏఐఎంఐఎంను కూటమిలో చేర్చుకొని విషయమై ఇప్పటి వరకు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
అయితే, ఈ విషయంలో మహా వికాస్ అఘాడీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే పెద్ద ఎదురుదెబ్బ తగలవచ్చు. అంతేకాదు, ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్న మహా వికాస్ అఘాడీకి 28 అసెంబ్లీ స్థానాల జాబితాను కూడా ఏఐఎంఐఎం సమర్పించింది. ఈ 28 స్థానాలన్నీ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు లేదా ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న ప్రాంతాలని ఆ పార్టీ పేర్కొంది.
కానీ, పొత్తు కుదిరితే మాత్రం మిత్రపక్షాలకు కొన్ని సీట్లు వదిలిపెట్టేందుకు కూడా ఏఐఎంఐఎం సిద్ధమైంది. కూటమిలో ఇప్పటికే ఉన్న పార్టీలు సీట్లను పంచుకోవడంలో ఒక అవగాహనకు రాలేకపోయాయి. కాబోయే ముఖ్యమంత్రి తామేనని ఇప్పటికే కాంగ్రెస్ బహిరంగంగానే చెబుతోంది. యుబిటి కూడా తమతో కూటమి నాయకత్వాన్ని కొనసాగించాలని పట్టుబట్టింది.
ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి ముఖంపై నిర్ణయం తీసుకుంటామని, ఏ పార్టీకి ఎక్కువ అసెంబ్లీ సీట్లు లభిస్తుందో ఆ పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఎంచుకుంటామని శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే, ఓవైసీ పొత్తు బిజెపి కూటమికి ప్రయోజనం కలిగిస్తుందని ఉద్ధవ్ థాకరే హెచ్చరిస్తున్నారు. పైగా, ఆ పార్టీ కోరుతున్న చాలా సీట్లలో థాకరే పార్టీ పోటీ చేయాలనుకొంటున్నవి ఉన్నాయి.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం