ఛత్తీస్ గఢ్ లో 36 మంది నక్సల్స్ హతం

ఛత్తీస్ గఢ్ లో 36 మంది నక్సల్స్ హతం

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మరోసారి తుపాకీల మోత మోగింది. నారాయణ్‌పుర్‌- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 36కి చేరినట్లు పోలీసులు వెల్లడించారు.  ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య గంటగంటకూ పెరిగింది. ఈ క్రమంలో మృతులంతా మావోయిస్టులేనా? లేదంటే వారిలో గ్రామస్థులూ ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బస్తర్‌ రేంజ్‌లోని దంతెవాడ- నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మాడ్‌ దండకారణ్యంలోని తుల్‌తులి, నెందూర్‌ గ్రామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎదురు కాల్పులు జరిగిటన్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ మీడియాకు తెలిపారు. అక్కడ మావోయిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌ అనంతరం 36 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్‌, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో అడపాదడపా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు ఐజీ తెలిపారు.  వరుస ఘటనలతో బస్తర్‌ డివిజన్‌ వార్‌జోన్‌ మారాయి. ఇప్పటి వరకు జరిగిన 12 భారీ ఎన్‌కౌంటర్లలో 185 మంది మావోయిస్టులు మృతిచెందారు.

నారాయణపూర్‌, దంతెవాడ సరిహద్దు నెందూర్‌, తులతులి అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు బలగాలకు ఇంటెలిజెన్స్‌ నుంచి శుక్రవారం సమాచారం అందింది. ఈ రెండు జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వు గార్డు (డీఆర్‌జీ), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్)తో పాటు ఐటీబీపీ, బీఎ్‌సఎఫ్‌ బెటాలియన్లకు చెందిన మొత్తం 1200 మంది మావోయిస్టుల కోసం సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. 

ఓర్చా, బారాసూర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిదిలోని గ్రామాలు గోవెల్‌, నెందూర్‌, తులతులి సమీపంలో శుక్రవారం ఉదయం అబూజ్‌మడ్‌లో బలగాలు కూంబింగ్‌ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నెందూర్‌-తులతులి సమీపంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు మొదలు పెట్టడంతో ప్రతిగా బలగాలు తీవ్రంగా స్పందించాయి. ఇరువర్గాల మధ్య భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. ఇక ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

మావోయిస్టు పార్టీ 20 ఏళ్ల వార్షికోత్సవాలను సెప్టెంబరు 21 నుంచి నెల రోజుల పాటు నిర్వహిస్తోంది. సమావేశాల్లో 20 ఏళ్లలో మావోయిస్టు పార్టీ ఎదుర్కొన్న ఆటుపోట్లు, అవరోధాలను నక్సల్స్‌ చర్చించనున్నారు. అడవుల్లో సభలు సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17 వేల మంది బలయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నక్సల్స్‌ అంతానికి బలమైన, పకడ్బందీ వ్యూహం అవసరమని పేర్కొన్నారు. 2004-14 వ్యవధితో పోలిస్తే 2014-24 మధ్యకాలంలో నక్సల్స్‌ సంబంధిత ఘటనల్లో 53 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్రమంత్రి తెలిపారు. 

2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ఏకకాలంలో భద్రతా కార్యకలాపాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్‌ఐఏ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు మావోయిస్టు హింస నిర్మూలనకు కృషి చేస్తున్నాయని తెలిపారు.

సెప్టెంబర్ 30న సీఆర్పీఎఫ్ (సీఆర్ పిఎఫ్) అదనపు డైరెక్టర్ జనరల్  అమిత్ కుమార్ మాట్లాడుతూ నక్సలిజం ఎక్కువగా ఛత్తీస్ గఢ్ లోని రెండు, మూడు జిల్లాలకే పరిమితమైందని, రాబోయే ఏడాదిన్నరలో వామపక్ష తీవ్రవాదం చరిత్రగా మారుతుందని తెలిపారు. నక్సలైట్ ఉద్యమం చివరి దశకు చేరుకుందని స్పష్టం చేశారు. గతంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్న మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడు నక్సల్స్ రహితంగా మారాయని చెప్పారు.