
జార్ఖండ్‌లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని జెంఎఎం సంకీర్ణ ప్రభుత్వ ప్రమాదకర ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. బీజేపీ పరివర్తన్ యాత్ర ముగింపు సందర్భంగా హజారీబాగ్ లో ఏర్పాటు అయిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ రాష్ట్ర గుర్తింపు, సాంస్కృతిక జానపద కళాత్మక వారసత్వం దెబ్బతినే పరిణామాన్ని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిపెట్టిందని ధ్వజమెత్తారు.
చొరబాటు దార్లను యధేచ్చగా ఇక్కడికి రానిస్తున్నారని, దీనితో క్రమేపీ స్థానికుల జనాభా తగ్గుముఖం పడుతోందని చెబుతూ ఇది ఎంతటి ప్రమాదకరమనేది అందరూ అర్థం చేసుకోవల్సి ఉందని కోరారు. ఇటువంటి వినాశకర శక్తులను తిప్పికొట్టి, తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని పిలుపిచ్చారు. భూమి, బిడ్డ, రొట్టెల పరిరక్షణకు అంతా ఏకం కావల్సి ఉందని పేర్కొన్నారు.
పార్టీ బలోపేతం, ప్రజల వద్దకు మరింత విస్తరించుకునే క్రమంలో చేపట్టిన పరివర్తన్ యాత్ర రాష్ట్రంలోని 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏకంగా దాదాపుగా 5400 కిలోమీటర్ల మేర సాగింది. ఇందులో దశలవారిగా పలువురు బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. చివరి ఘట్టం పూర్తి సందర్భంగా మోదీ తమ సందేశం వెలువరించారు.
అవినీతి నిరోధానికి ఇక్కడ పరివర్తన అవసరం ఉంది. అందుకే బిజెపి ప్రజల కోసం ఈ కార్యక్రమం చేపట్టిందని ప్రధాని చెప్పారు. ఇక్కడి సంకీర్ణపు ప్రభుత్వం చివరికి ఓట్ల కోసం తమ రాజకీయ ప్రయోజనాల కోసం పలు విషయాలలో విచక్షణారహితంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని ప్రధాని మండిపడ్డారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ దశలో యువ అభ్యర్తులు దుర్మరణం చెందారని, వారి కుటుంబాలలో విషాదం నిండిందని చెబుతూ అయినా ఇక్కడి ప్రభుత్వం స్పందించలేదని ప్రధాని ధ్వజమెత్తారు.
హజారీబాగ్‌కు రాగానే మోదీ ఇక్కడ ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా వెళ్లినప్పుడు పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు స్వాగతం పలికారు. ఓ చోట ఆయన ఆదివాసీలను కలిసి మాట్లాడారు. వారికి భరోసా ఇచ్చారు. గిరిజన మహిళలు కొందరు ప్రధాని మోదీకి ఈ దశలో ఇక్కడి మట్టితో కూడిన కలశం అందించారు.
ఇక్కడి నేలను, ఆడపిల్లలను, రోటిని పరిరక్షించే క్రమంలో మార్పు తీసుకువస్తామని ప్రధాని కతెలిపారు. సెప్టెంబర్ 20వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలోని సాహిబ్‌గంజ్ నుంచి బిజెపి పరివర్తన్ యాత్రకు పచ్చజెండా చూపి ఆరంభించారు. ఇదే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు యాత్రలు వేర్వేరుగా కదిలాయి. ఇప్పుడు హజారీబాగ్‌లో ముగిశాయి.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు