తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ కేవీ వి బాలకృష్ణన్ ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ జరగకముందే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని పేర్కొంది.
ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మీడియా ముందుకు వెళ్లారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూ వివాదంపై విచారణకు ఆదేశించినట్లైతే మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటని అభిప్రాయపడింది. తిరుపతి లడ్డూల వివాదంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది.
నెయ్యి కల్తీ జరిగినట్టు గుర్తించిన తర్వాత , తయారైన లడ్డూలను టెస్టింగుకు పంపారా? లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మైసూర్, గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదుని ప్రశ్నించారు. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశించారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బావుంటుందని అభిప్రాయపడుతూ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.
కల్తీ నెయ్యితో లడ్డుల తయారీ చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉంటే తప్ప ఈ వాదనలు అర్థరహితం అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ల్యాబ్ రిపోర్ట్ మేరకు కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించలేదని తెలుస్తోందంది. ఈ ల్యాబ్ రిపోర్ట్ స్పష్టంగా లేదు, ఆ నెయ్యిను తిరస్కరించారని ల్యాబ్ రిపోర్ట్ ప్రాథమికంగా సూచిస్తోందని కోర్టు తెలిపింది.
కనీసం దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని తాము ఆశిస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. లడ్డు రుచి సరిగా లేదని ప్రజలు ఫిర్యాదు చేశారని లూథ్రా కోర్టుకు తెలిపారు. ప్రసాదం తయారీలో కలుషిత నెయ్యిని ఉపయోగించారని రుజువు చేయాలని సుప్రీంకోర్టు కోరింది.
కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. అలాగే స్వామి వారి ప్రసాదం లడ్డూని పరీక్షల కోసం ల్యాబ్‌కి ఎప్పుడు పంపారని ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహాత్గిని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
పరకామణి కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
400 కిలోల బంగారంతో సహా రూ 400 కోట్ల మావోయిస్టుల నిధులు!