సీతారాం యేచూరి స్థానంలో ప్ర‌కాష్ కార‌త్

సీతారాం యేచూరి స్థానంలో ప్ర‌కాష్ కార‌త్
సీపీఎం పొలిట్ బ్యూరో తాత్కాలిక కోఆర్డినేటర్ గా ప్ర‌కాష్ కార‌త్ ను పార్టీ కేంద్ర క‌మిటీ నిర్ణ‌యించింది. ఆయ‌న ఏప్రిల్ వ‌ర‌కు ఆ బాధ్య‌త‌ల్లో ఉంటారు. ఇటీవ‌ల అనారోగ్యంతో మ‌ర‌ణించిన సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి స్థానాన్ని తాత్కాలికంగా ప్ర‌కాష్ క‌ర‌త్‌తో భ‌ర్తీ చేస్తున్నారు.

ఆదివారం ఢిల్లీలో ప్రారంభమైన రెండు రోజుల కేంద్ర  కమిటీ సమావేశాల్లో పార్టీ తాత్కాలిక కోఆర్డినేటర్ గా ప్ర‌కాష్ క‌ర‌త్‌నుఎంపిక చేస్తూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ‘‘ఢిల్లీలో జరుగుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) సెంట్రల్ కమిటీ 24వ పార్టీ మ‌హాస‌భ జరిగే వరకు (2025 ఏప్రిల్‌లో మధురైలో) సీపీఎం మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పొలిట్ బ్యూరో స‌భ్యులు ప్ర‌కాశ్ క‌ర‌త్‌ను పొలిట్ బ్యూరో, అలాగే సెంట్రల్ కమిటీకి సమన్వయకర్తగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. సీపీఎం ప్ర‌స్తుత‌ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సీతారాం ఏచూరి విచారకరమైన, ఆకస్మిక మరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది’’ అని ఆ ప్ర‌క‌ట‌న‌లో సీపీఎం కేంద్ర క‌మిటీ స‌భ్యులు ముర‌ళీధ‌ర‌న్ పేర్కొన్నారు.

సీపీఎం నేత ప్ర‌కాష్ క‌ర‌త్ ఇప్ప‌టికే ప‌దేళ్ల పాటు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌తలు నిర్వ‌ర్తించారు. 1948 ఫిబ్ర‌వరి 7న నాటి బ‌ర్మా (మయన్మార్)లోని లేత్‌ప‌ద‌న్‌లో నాయ‌ర్ కుటుంబంలో ప్ర‌కాశ్ క‌ర‌త్ జ‌న్మించారు. ఆయ‌న సీపీఎం పొలిట్ బ్యూరో స‌భ్యురాలు బృందా క‌ర‌త్‌ను వివాహం చేసుకున్నారు.  1982-85 మ‌ధ్య సీపీఎం ఢిల్లీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్ర‌కాష్ క‌ర‌త్‌, 1985లో సీపీఎం కేంద్ర క‌మిటీలోకి ఎన్నిక అయ్యారు.

ఆ త‌రువాత 1992లో సీపీఎం పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఎన్నిక అయ్యారు. 2005లో ఢిల్లీలో జ‌రిగిన సీపీఎం 18వ మ‌హాస‌భ‌లో ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నిక అయ్యారు. అప్పటి నుంచి ప‌దేళ్ల పాటు ప్ర‌కాష్ క‌ర‌త్ సీపీఎం ప్ర‌ధాన కార్య‌దర్శిగా బాధ్య‌త‌ల్లో ఉన్నారు. 2015లో ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన సీపీఎం 21 మ‌హాస‌భలో ప్ర‌కాష్ క‌ర‌త్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బాధ్య‌త‌ల నుండి త‌ప్పుకున్నారు.

రాజ‌కీయాల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ కోసం బ్రిట‌న్‌లోని ఎడిన్‌బ‌ర్గ్ యూనివ‌ర్శిటీలో స్కాల‌ర్‌షిప్ పొందారు. ఎడిన్‌బ‌ర్గ్‌లో ఆయ‌న విద్యార్థి రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మారారు. 1970లో భార‌త దేశానికి తిరిగి వ‌చ్చిన ప్ర‌కాష్ క‌ర‌త్‌, జేఎన్‌యూలో పిహెచ్ డి చేస్తున్న‌ప్పుడు 1971 నుండి 1973 వ‌ర‌కు పార్ల‌మెంట్‌లో సీపీఎం నేత‌, కేర‌ళ‌కు చెందిన లెజెండ‌రీ క‌మ్యూనిస్టు నేత ఏకే గోపాల‌న్‌కు స‌హాయ‌కుడిగా ఉన్నారు.

జేఎన్‌యూలో ఎస్ఎఫ్ఐ వ్య‌వ‌స్థాప‌కుల్లో ప్ర‌కాష్ క‌ర‌త్ ఒక‌రు. ఆయ‌న జేఎన్‌యూ స్టూడెంట్ యూనియ‌న్‌కు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. 1974-79 మ‌ధ్య ఎస్ఎఫ్ఐ అధ్య‌క్షుడు అయ్యారు. 1975-76లో దేశంలో ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ఏడాద‌న్న‌ర కాలంలో అజ్ఞాత‌వాసంలో ఉన్నారు.