100 రోజుల్లో ఏపీకి వివిధ ప్రోజెక్టులకై రూ 60,000 కోట్లు

100 రోజుల్లో ఏపీకి వివిధ ప్రోజెక్టులకై రూ 60,000 కోట్లు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 100 రోజులలో  రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు రూ 60,000 కోట్లు కేటాయించేందుకు కేంద్రం సమ్మతి తెలిపిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.  పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి రూ.12,000 కోట్ల మంజూరు చేయగా, మొదటి దశ సకాలంలో పూర్తయితే రెండో దశ నిర్మాణానికి మరో రూ.18,000 కోట్లు ఇవ్వడానికి సుముఖత తెలిపిందని తెలిపారు.
 
అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15,000 కోట్లు అందనున్నాయని,  ఒక్కోదానికి రూ 2,500 కోట్ల చొప్పున రెండు పారిశ్రామిక కారిడార్ లకు మొత్తం రూ.5 వేల కోట్లు మంజూరు చేశారని చెప్పారు.  అమరావతిని దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేయడానికి కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఇవ్వనున్నారు. అమరావతి చుట్టుపక్కల ఉన్న వివిధ జాతీయ రహదారుల విస్తరణకు మరో రూ. 2,500 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుందని వివరించారు. 
 
తాజాగా విశాఖ ఉక్కుకు రూ.2,000 కోట్లు ఇవ్వనుంది. ఉపాధి హామీ పథకం పనుల నిమిత్తం గ్రామ పంచాయతీలకు ఇటీవల రూ. 2,500 కోట్లు విడుదలయ్యాయి. వీటన్నింటి విలువ రూ.60 వేల కోట్లు. ఇవిగాక పెట్రో కారిడార్‌ అనుకొన్న పద్ధతిలో ముందుకు వెళ్తే కేంద్రం నుంచి దీనికి మరో రూ. 60,000 కోట్లు వస్తాయి. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి లేదా రెండు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి కూడా కేంద్రం సుముఖత తెలిపిందని చంద్రశేఖర్ తెలిపారు.

కాగా, రాష్ట్రానికి 30 ఈఎస్ఐ ఆస్పత్రులను కేంద్రం మంజూరు చేసిందని పెమ్మసాని తెలిపారు. అమరావతిలో రూ. 250 కోట్లతో 400 పడకల ఆస్పత్రి రాబోతోందని చెప్పారు. భూ కేటాయింపు పూర్తయిన వెంటనే వీటి నిర్మాణం మొదలవుతుందని, నిధులకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. అమరావతిలో తపాలా శాఖ రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరయ్యాయని, భూ కేటాయింపు జరగ్గానే దీని నిర్మాణం కూడా ప్రారంభమతుందని పేర్కొన్నారు. 

 
కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు సంబంధించి సుమారు వంద నిర్మాణాలు జరగాల్సి ఉందని చెబుతూ త్వరగా జరిగేలా ఆయా శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను వ్యవసాయంతో అనుసంధానం చేయడానికి కేంద్రం ఆసక్తితో ఉందని, త్వరలో దీనిపై ఉన్నత స్ధాయి సమావేశం నిర్వహించనుందని పెమ్మసాని తెలిపారు.
పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆవాస్‌-2024 పేరుతో కేంద్రం ఒక యాప్‌ను తయారు చేసిందని, అర్హుల ఎంపికకు ఈ యాప్‌ ద్వారా దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించనున్నారని చెప్పారు. కొత్త సర్వేను మొదలు పెట్టామని, దీని కింద అర్హత ఉంటే ఎన్ని లక్షల మందికైనా కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు.