తెలంగాణ మంత్రి వర్గంలో కీలకంగా ఉన్నరెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈడి సోదాలు నిర్వహించింది. ఆయన కుటుంబానికి చెందిన రాఘవ ఇన్‌ఫ్రా, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లతోపాటు పలు కంపెనీలపై అనేక ఆరోపణలున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఐటీ, కస్టమ్స్ వంటి దర్యాప్తు సంస్థలు గతంలో సోదాలు నిర్వహించగా తాజాగా ఈడీ రంగ ప్రవేశం చేయడం కలకలం రేపుతున్నది.
ఈడీ దాడులు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. సుమారు 16 గంటలపాటు కొనసాగిన ఈ సోదాలపై ఉదయం నుంచీ ఉత్కంఠ నెలకొన్నది. జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి తనయుడు హర్షారెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. సోదాలు జరుగుతున్నంతసేపు ఆయనే అక్కడే ఉన్నారు.
మధ్యాహ్నం వేళ రాఘవ గ్రూప్‌కు సంబంధించిన ఆడిటర్‌ను పిలిపించిన ఈడీ అధికారులు.. ఆయనతోకలిపి హర్షారెడ్డిని విచారించారు. ఈ సందర్భంగా పలు కీలక లావాదేవీలు, అనుమానాస్పద కార్యకలాపాలు, అక్రమాస్తులపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. పొంగులేటి వివాదాలపైనా వారు ఆరా తీసినట్టు చర్చ జరుగుతున్నది.
హైదరా బాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఇడి శుక్రవారం సోదాలు జరిపింది. జూబ్లీహిల్స్ పొంగులేటి ఇంటి వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఉంచి సోదాలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు, ఏకకాలంలో 16 చోట్ల సోదాలు జరిపాయి. శుక్రవారం ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు జరగ్గా, జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి కుమార్తె నివాసంలోనూ ఇడి సోదాలు నిర్వహిం చింది. పొంగులేటి నివాసంతో పాటు బంధువుల ఇళ్లల్లోనూ ఈడి సోదాలు జరిపింది.
హిమాయత్ సాగర్ ఫాంహౌస్‌లో ఇడి తనిఖీలు నిర్వహిం చింది. పది బృందాలుగా విడిపోయి ఇడి సోదాలు నిర్వహించిందని తెలుస్తోంది. కంపెనీ ఎండీ, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో 16 బృందాలు తనిఖీలు చేశారు. ఖమ్మంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిలో ఇడి దాడులు చేసింది. ఢిల్లీ జోనల్ అధికారులు తనిఖీలు చేపట్టారని తెలిసింది.
పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,495 కోట్ల కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్నది. ఈ క్రమంలో వెస్టిండీస్‌లోని ఎగ్జిమ్‌బ్యాంకు నుంచి ఏపీ ప్రభుత్వానికి రూ. 80 కోట్ల విలువైన గ్యారెంటీలు సమర్పించింది. అయితే, ఆ గ్యారెంటీలపై ఏపీ సర్కారు అనుమానాలు వ్యక్తం చేయడం, దేశీయ బ్యాంకింగ్ సంస్థలను కాదని ఎక్కడో కరేబియన్ దీవుల్లోని ఎగ్జిమ్‌బ్యాంకు నుంచి పొంగులేటి గ్యారెంటీలు సమర్పించడం అనుమానాలకు తావిచ్చింది.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి చిన్న వయస్సులోనే బిలియనీర్‌గా మారా రు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. హర్ష రెడ్డి పేరుతో రూ.1300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా చెన్నైకి అక్రమంగా తరలిన పాటెక్ ఫిలిప్ 5740, రెండోది బ్రెగ్యుట్ 2759 వంటి ఖరీదైన చేతిగడియారాల కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చారు.
మద్రాస్ హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నది. పట్టుబడిన వాచీల విలువ రూ. 8 కోట్ల వరకు ఉన్నప్పటికీ, అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన మధ్యవర్తి నవీన్ కుమార్ రూ. 100 కోట్లకు పైగా స్మగ్లింగ్ చేసినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. క్రిప్టో, హవాలా ద్వారా పెద్దయెత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్టు పేర్కొన్నారు.
రూ.650 కోట్ల విలువైన టీడీఎస్‌ను ఎగ్గొట్టేందుకు రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్వాహకులు మూడు బోగస్ కంపెనీలను సృష్టించారని వార్తలు వచ్చాయి. కాగితాలకు మాత్రమే ఈ కంపెనీలు పరిమితమయ్యాయా? నిజంగానే ఉన్నాయా? ఒకవేళ ఉంటే ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాయి? అనే వివరాలకు సంబంధించి డైరెక్టరేట్ ఆప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆరునెలల కిందటే రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను నమోదు చేశారు. ఇప్పుడు ఆ విషయమై సోదాలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

More Stories
ఆర్ఎస్ఎస్ పై ఆంక్షలు.. సిద్ధరామయ్యకు హైకోర్టులో చుక్కెదురు
భారతీయ నేలల్లో తీవ్రంగా లోపించిన పోషకాలు
మావోయిస్టు తెలంగాణ నేత బండి ప్రకాష్ లొంగుబాటు