దీపావళికి ముందే తగ్గనున్న పెట్రోల్ ధరలు!

దీపావళికి ముందే తగ్గనున్న పెట్రోల్ ధరలు!
పెట్రోల్, డీజిల్ ధరలు దేశీయంగా కొంత కాలంగా గరిష్ట స్థాయిల్లో ఉన్న సంగతి తెలిసిందే. లీటర్‌పై పెట్రోల్ కోసం రూ. 100కు పైనే చెల్లించాల్సి వస్తుండగా, డీజిల్‌పైనా దాదాపు అంతే ఉంది. భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లలో పెద్దగా మార్పు లేక రెండేళ్లకుపైనే అయింది. మొన్నటికి మొన్న దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు లీటర్ పైన రూ. 2 చొప్పున తగ్గించాయి చమురు కంపెనీలు. 
 
మళ్లీ అప్పటి నుంచి కూడా ఎలాంటి కదలిక లేదు. దాని కంటే ముందు మాత్రం ఏకంగా 2022 మే నెలలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు మారాయని చెప్పొచ్చు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ రేట్లు భారీగా తగ్గుతున్నప్పటికీ దేశీయంగా మాత్రం మార్చేందుకు కేంద్రం, చమురు కంపెనీలు ప్రయత్నించట్లేదు. అక్కడ రేట్లు తగ్గగా దేశీయంగా కూడా ఇంధన ధరలు తగ్గుతాయన్న ఆశతో ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. 
 
త్వరలో వీటి ధరలు తగ్గుతాయని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీల్లో ఒకటైన ఇక్రా కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా చమురు రేట్లు పడిపోతున్న క్రమంలో దేశీయంగా చమురు సంస్థల మార్జిన్లు బాగా పెరిగాయని గుర్తుచేసింది. అందుకే లీటరుపై సుమారు రూ. 2 నుంచి 3 వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీపావళికి ముందే తగ్గనున్నట్లు అంచనా వేస్తోంది.

భారత్ దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ సగటు ధర సెప్టెంబరులో బ్యారె‌ల్‌కు 74 డాలర్లుగా ఉంది. ఈ సంవత్సరం మార్చి నెలలో చూస్తే ఇది బ్యారెల్ మీద 83-84 డాలర్లుగా ఉండేది. అంతర్జాతీయంగా కొంత కాలంగా క్రూడాయిల్ రేట్లు కనిష్ట స్థాయిల్లోనే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థల మార్జిన్లు  మెరుగయ్యాయని, ఇది ఇలాగే కొనసాగితే రిటైల్ చమురు రేట్లను తగ్గించొచ్చని రేటింగ్ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది.

అంతర్జాతీయ రేట్లతో పోల్చినప్పుడు చమురు సంస్థల పెట్రోల్ రేట్లు లీటర్‌కు రూ. 15, డీజిల్‌పై రూ. 12 చొప్పున ఆర్జిస్తున్నట్లు ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన గిరీశ్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగానే దేశీయంగా ఇంధన ధరల్ని సవరించుకునే వెసులుబాటు 2021 నుంచే అమల్లో ఉన్నప్పటికీ చమురు సంస్థలు మాత్రం ఏ మాత్రం మార్చట్లేదు. 

 
గతంలో ప్రతి రోజూ ఉదయాన్నే పెట్రోల్, డీజిల్ ధరల్లో 10 పైసలు, 50 పైసలు, 60 పైసలు అని ఇలా హెచ్చుతగ్గులు ఉండేవి. తర్వాత ఈ విధానమే అమలు చేయట్లేదు. ఇంకా కొద్ది రోజుల కిందట దేశీయంగా ఉత్పత్తి అవుతున్న చమురు ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ ఎత్తేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలో ఇంధనం రేట్లు తగ్గించనున్నట్లు తెలుస్తోంది.