పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నది. లెబనాన్‌పై భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతున్నది. 21 రోజుల కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది.
పూర్తిస్థాయిలో హెజ్బొల్లాపై దాడులు చేయాలని సైన్యాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లెబనాన్ మరో గాజాలా మారనుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని ఇప్పుడు లెబనాన్ వైపు మార్చింది. హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఆ దేశంపై గగనతల, రాకెట్ల దాడులతో విరుచుకుపడుతున్నది.
సోమవారం నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 630 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. లెబనాన్ ఉత్తర, తూర్పు ప్రాంతాలపై ఇజ్రాయెల్ 75 లక్షిత దాడులు చేసింది. దీనికి ప్రతిగా లెబనాన్ చేసిన 45 దాడులను తాము సమర్థంగా తిప్పికొట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు పలు అగ్రరాజ్యాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. 21 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలంటూ యూఎస్, యూకే, ఈయూ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తోసిపుచ్చారు. హెజ్బొల్లాపై పూర్తిస్థాయిలో దాడి చేయాలని ఆదేశించారు.
అదే సమయంలో ప్రస్తుతం లెబనాన్‌పై దాడులు జరుపుతున్నప్పటికీ తమ యుద్ధ లక్ష్యం నెరవేరే వరకు గాజాపై కూడా దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలని లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి కోరారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ గగన దాడులతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలతో జరుగుతున్న దాడుల వల్ల లెబనాన్ పౌరులలో భయం నెలకొందని తెలిపారు
కాగా, లెబనాన్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ నివసిస్తున్న భారత పౌరులు దేశాన్ని విడిచివెళ్లాలని, అక్కడే ఉండాలనుకునే వారు జాగ్రత్తలు పాటించాలని బీరుట్‌లోని భారత ఎంబసీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఏదైనా అవసరమైతే బీరుట్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో లైవ్ టీవీ ఇంటర్వ్యూ జరుపుతున్న లెబనాన్ జర్నలిస్టు ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. మిరయా ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఫడీ బౌండ్య ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఉండగా, ఇజ్రాయెల్ ప్రయోగించిన మిస్సైల్ ఒకటి అతని ఇంటిని తాకింది. దీంతో ఆయన బిగ్గరగా అరుస్తూ స్క్రీన్‌కు దూరంగా పడ్డారు.
మరోవంక, పాలస్తీనా, లెబనాన్‌ల్లో ఇజ్రాయిల్ ఊచకోతలకు పాల్పడతున్నా అంతర్జాతీయ సమాజం మౌనంగా చూస్తూ కూర్చోవడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెషికాన్ ఆందోళన వ్యక్తం చేశారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ పశ్చిమ దేశాల వైపు నుండి కార్యాచరణ లోపించినందున దానికి ప్రత్యామ్నాయంగా శాంతి స్థాపనకు, సమిష్టి సంక్షేమానికి ప్రాంతీయ చొరవ తీసుకోవాలని ప్రతిపాదించారు.
హింసను తక్షణమే ఆపి, గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవడం అవశ్యమని ఆయన స్పష్టం చేశారు. లెబనాన్‌లో ఇజ్రాయిల్ ఆటవిక చర్యలకు తక్షణమే ఫుల్‌స్టాప్ పెట్టేలా చూడాలని కోరారు. ప్రాంతీయంగా చెలరేగిన ఈ ఘర్షణలు ఇతర ప్రాంతాలకు, మొత్తంగా ప్రపంచానికి వ్యాపించకముందే జాగ్రత్త పడాలని సూచించారు.
అంతర్జాతీయ సమాజం చేతులు ముడుచుకుని కూర్చోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. 42వేల మందికి పైగా పాలస్తీనియన్ల హత్యకు జవాబుదారీతనం కావాలని డిమాండ్ చేశారు. పైగా ఇజ్రాయిల్ చర్యలను వ్యతిరేకించడాన్ని యూదు వ్యతిరేకిగా ముద్ర వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కులను దారుణంగా ఇజ్రాయిల్ అతిక్రమిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన