50కి పైగా మందుల ఉత్పత్తుల్లో నాణ్యత కరువు

50కి పైగా మందుల ఉత్పత్తుల్లో నాణ్యత కరువు
మార్కెట్‌లో విరివిగా దొరికే 50కి పైగా మందులలో నాణ్యత లేదని తేలింది. సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సిడిఎస్‌సిఒ) తన తాజా సర్వేలో దీనిని గుర్తించింది. కొత్త మందులు, క్లినికల్‌ ట్రయల్స్‌ ఆమోదానికి బాధ్యత వహించే ఉన్నత సంస్థ సిడిఎస్‌సిఒ. నాణ్యత లేనివిగా గుర్తించిన మందులు ఇప్పటికే మార్కెట్‌లో విరివిగా అమ్ముడవుతున్నాయని సిడిఎస్‌సిఒ హెచ్చరించింది. 
 
వీటిలో అత్యధికం ప్రముఖ కంపెనీలు విక్రయించే మందులు కావడం గమనార్హం. హైబీపీ, యాసిడ్‌ రీఫ్లక్స్‌ వంటి సాధారణ పరిస్థితులలో వినియోగించే మందులు కూడా డొల్ల మందులుగా తేలాయి. ఉదాహరణకు, సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారు చేసిన పుల్మోసిల్‌ (సిల్డెనాఫిల్‌ ఇంజెక్షన్‌) నిర్దిష్ట బ్యాచ్‌ నాణ్యత లేనిదిగా నిర్ధారణయ్యింది. అయితే ఆ నాణ్యతలేని ఉత్పత్తిని తాము తయారు చేయలేదనీ, అది నకిలీదని సన్‌ఫార్మా పేర్కొంది. 
 
ఇదే కంపెనీ తయారు చేసిన యాసిడ్‌ రీఫ్లక్స్‌, అజీర్ణానికి సాధారణంగా ఉపయోగించే పాంటోసిడ్‌ నిర్దిష్ట బ్యాచ్‌ కూడా నకిలీదిగా తేలింది. దీంతో పాటు గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ ద్వారా తయారైన రక్తపోటును నియంత్రించటం కోసం ఉపయోగించే రెండు మెడిసిన్‌ల కలయిక అయిన టెల్మా హెచ్‌ (టెల్మిసర్తన్‌ 40 ఎంజీ, హైడ్రోక్టోరోతియాజైడ్‌ 12.5 ఎంజీ టాబ్లెట్స్‌ ఐపీ)లోనూ నాణ్యత లేదని వెల్లడైంది. గ్లెన్‌మార్క్‌ సైతం నిర్దిష్ట బ్యాచ్‌ను తాము తయారు చేయలేదని వివరణ ఇచ్చింది.
ఆగస్టు నెలకు గాను విడుదల చేసిన ఈ నివేదికలో షెల్కాల్‌, విటమిన్‌ సి సాఫ్ట్‌జెల్స్‌తో కూడిన విటమిన్‌ బి కాంప్లెక్స్‌, విటమిన్‌ సి అండ్‌ డీ3, సిప్రోఫ్లోక్సాసిన్‌ తదితర ఔషధాలూ తగిన నాణ్యత లేనివిగా తేలాయి. అధిక రక్తపోటుకు వాడే టెల్మిసర్టాన్‌, ఆట్రోపైన్‌ సల్ఫేట్‌, అమోక్సీసిల్లియన్‌, పొటాషియం క్లావులనేట్‌ కూడా నాసిరకంగా ఉన్నట్టు తెలిసింది. నాణ్యత లేని ఔషధాల అలర్ట్‌ డాటాను ఆగస్టు నెలకు తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలు సమర్పించలేదని సీడీఎస్‌సీవో తెలిపింది.