తిరుమల లడ్డూ సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి

తిరుమల లడ్డూ సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠిని  సిట్‌ చీఫ్‌గా నియమించింది. 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన త్రిపాఠి, గతంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీగా పని చేశారు.  సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేస్తున్న పాలరాజుని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
ఆయన స్థానంలో త్రిపాఠిని ఈసీ నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఐజీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుమల వెంకన్న లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంతో పాటు, తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సిట‌్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన నిజనిజాలు నిగ్గుతేల్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

మరోవంక, తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఓ సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్, 2011 నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిగి ఉన్న సెంట్రల్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదని ఫుడ్ రెగ్యులేటర్ ఆ నోటీసులో ప్రశ్నించింది.