
ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ (77) అనారోగ్యంతో చెన్నైలో మృతి చెందారు. ఈమె ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వదిన, మాజీ ఎంపీ దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి. ఆమె వయస్సు రీత్యా అనారోగ్యంతో ఉన్న సమయంలో ఇటీవల వారి కుమారుడు విజయ్ బాబు మృతి చెందారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. గత కొన్ని రోజుల నుంచి చెన్నైలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మాగుంట పార్వతమ్మ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో బెజవాడ రామారెడ్డి దంపతులకు 1947 జూలై 27న జన్మించారు. ఆమె కస్తూరి దేవి బాలికల పాఠశాలలో విద్యను అభ్యసించారు. మాగుంట పార్వతమ్మకు 19 ఫిబ్రవరి 1967న మాగుంట సుబ్బరామిరెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు.
ఒంగోలు ఎంపీగా ఉన్న సుబ్బరామరెడ్డి 1995లో పీపుల్స్ వార్ గ్రూప్ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యారు. 1996లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్వతమ్మ ఒంగోలు నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై 50,060 ఓట్ల మెజారిటీతో గెలిచి 11వ లోక్‌సభకు ఎంపీగా ఎంపికయ్యారు.
మాగుంట పార్వతమ్మ 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్వతమ్మ ఆకస్మిక మృతి మా కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతమ్మ మృతితో కుటుంబ పెద్దను కోల్పోయామని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. గురువారం నెల్లూరులో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి.
మాగుంట పార్వతమ్మ మృతి పట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతాపం తెలిపారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి మాగుంట కుటుంబం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. జిల్లాలో ప్రతి గ్రామంతో మాగుంట కుటుంబానికి సత్సంబంధాలున్నాయని ఆయన గుర్తు చేశారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు