
* పిల్లలను కనేందుకు ఆసక్తి చూపని నేటి మహిళలు
ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందటామె విడాకుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం అని ప్రముఖ గాయని ఆశా భోంస్లే తెలిపారు. ప్రస్తుత సమాజంలో విడాకుల సంస్కృతి పెరిగిపోయింది. ముఖ్యంగా యువత చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా చూస్తూ పెళ్లైన నెలల వ్యవధిలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు.
ఈ నేపథ్యంలో యువతరంలో విడాకుల రేటు పెరగడంపై ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఆందోళన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ తో ఆమె ఓ చర్చలో పాల్గొంటూ విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ యువతీయువకులు ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారని చెప్పారు. ‘నా భర్తపై నాకు కోపం వచ్చినప్పుడు మా అమ్మ దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి వచ్చేదాన్ని. అంతేకానీ, విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఈ రోజుల్లో ప్రతినెలా విడాకులు తీసుకొనేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది?’ అని ఆమె రవిశంకర్‌ను ప్రశ్నించారు.
దానికి ఆయన సమాధానం చెబుతూ “మీరు పాటలతో అందరినీ సంతోషపరుస్తారు. మీకు దేవుడిపై నమ్మకం ఉంది. అలాగే కష్టాలను తట్టుకునే శక్తి కూడా ఉంది. నేటి తరానికి సహనం తగ్గిపోయింది’ అని తెలిపారు.
‘నేను చిత్ర పరిశ్రమలో చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. నా కెరీర్‌లో ఎంతోమందిని చూశాను. ప్రస్తుత తరంతో పోలిస్తే గతంలో వారు ఎప్పుడూ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. యువతీయువకుల మధ్య ప్రేమ చాలా తర్వగా ముగుస్తోంది. ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారు. విడాకుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం’ అని ఆశా భోంస్లే పేర్కొన్నారు. అందుకు ప్రధాన కారణం ప్రేమ కన్నా ఆకర్షణకు ప్రాధాన్యత పెరగటమే అని రవి శంకర్ తెలిపారు.
ఇక ఇదే సందర్భంగా మహిళలు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపకపోవడంపై కూడా ఆశా భోంస్లే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో స్త్రీలు సంతానాన్ని ఓ భారంగా భావిస్తున్నారన్నారని, అన్ని వర్గాల మహిళలు ఇదే ధోరణితో ఉన్నారని ఆమె చెప్పారు. ‘ఈ రోజుల్లో స్త్రీలు సంతానాన్ని భారంగా భావిస్తున్నారు. నేను 10 సంవత్సరాల వయసులో ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించాను. ఆ తర్వాత నేను నా కెరీర్‌తోపాటు ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేశాను. వారికి వివాహం చేశాను. ఇప్పుడు నాకు మనవరాళ్లు కూడా ఉన్నారు’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
`నా భర్త లేకుండా నేను అన్ని బాధ్యతలను విజయవంతంగా, ఒంటరిగా నిర్వర్తించాను. నా పిల్లల చదువుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎంతో సహనంతో వ్యవహరించా. నా బిజీ వృత్తిలో రాత్రి పగలూ పని చేస్తూనే ఈ బాధ్యతలను నిర్వర్తించా’ అని ఆశా భోంస్లే వివరించారు.
కాగా, ఆశా భోంస్లే తన 16వ ఏట తన అక్క కార్యదర్శి గణపత్రావ్ భోంస్లే (31)ని వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా 1949లో గణపత్రావ్‌ను ఆమె మనువాడారు. వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. అయితే, 1960లో ఆయనతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1980లో ప్రముఖ గాయకుడు ఆర్‌డీ బర్మన్‌ను ఆశా వివాహం చేసుకుంది. ఆయన 1994లో జనవరిలో మరణించారు. ఇక 91 ఏళ్ల ఆశా భోంస్లే తన కెరీర్‌లో 12 వేలకుపైగా పాటలు పాడారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు