క్వాడ్ భద్రతా కూటమి ఏర్పాటు

క్వాడ్  భద్రతా కూటమి ఏర్పాటు
 
* ‘విల్మింగ్టన్‌ డిక్లరేషన్‌’లో పాక్‌పై నిప్పులు

చైనాకు చెక్ పెట్టే రీతిలో అమెరికాలోని విల్మింగ్టన్‌లో జరిగిన క్వాడ్ సదస్సులో ప్రస్తుత భద్రతా రక్షణ స వాళ్ల నేపథ్యంలో అనధికారిక డిఫ్యాక్టో భద్రతా కూటమిగా రూపొందాలని నిర్ణయించారు. ఈ డిఫాక్టో సెక్యూరిటీ అలయెన్స్ ఏర్పాటు నిర్ణయం తీర్మానంలో ఎక్కడ కూడా నేరుగా చైనా, రష్యా నుంచి సవాళ్లు ఎదురవుతున్న విషయాలు ప్రస్తావించలేదు. 

క్వాడ్ భద్రతా కూటమి అత్యంత కీలకం అవుతుంది, వాస్తవిక, సహేతుక ఫలితాలను ఇచ్చే శక్తిగా ఉంటుంది. మంచికి భరోసా కల్పిస్తుందని ప్రతిన వహిస్తున్నట్లు క్వాడ్ సదస్సు తరువాత వెలువరించిన ప్రకటనలో తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం సుస్థిరతకు బలోపేతానికి ఈ కూటమి అవసరం ఏర్పడిందని వివరించారు. విల్లింగ్టన్ డిక్లరేషన్‌గా ప్రకటించారు. 

ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వ్యూహాత్మక రీతిలో జట్టుగా మారినట్లు, ఇండో పసిఫిక్ ప్రాంతానికి రాబోయే కాలం అంతా మంచికి కూటమి ఏర్పాటు దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు క్వాడ్ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు. ప్రెసిడెంట్ జో బైడెన్, నరేంద్ర మోదీ, జపాన్ నేత కిషిడా ఫూమియో , ఆస్ట్రేలియా నేత ఆంథోని అల్బనిస్ మధ్య సమగ్ర చర్చల తరువాత 5700 పదాలతో డిక్లరేషన్ వెలువడింది. 

ఇది ఈ నాలుగు దేశాల మధ్య పూర్తి స్థాయి రక్షణ ఒప్పందంగానే ఉన్నప్పటికీ , అధికారిక ముద్ర లేకుండా లోపాయికారిగా కుదుర్చుకున్న ఒప్పందంగా డిక్లరేషన్ ద్వారా స్పష్టం అయింది. క్వాడ్‌ దేశాధినేతలు ‘విల్మింగ్టన్‌ డిక్లరేషన్‌’ పేరిట సీమాంతర ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. 

ఈ సందర్భంగా పరోక్షంగా పాకిస్థాన్‌ చర్యలపై నిప్పులు కురిపించారు. 26/11 ముంబై ఉగ్రదాడులు, పఠాన్‌కోట్‌ దాడి గురించి ప్రస్తావించారు. అదే సమయంలో చైనా, ఉత్తరకొరియాల తీరును కూడా పరోక్షంగా ఎండగట్టారు. రష్యాకు ఉత్తర కొరియా ఆయుధ సంపత్తిని అందజేస్తున్న విషయాన్ని ఆయా దేశాల పేర్లను ప్రస్తావించకుండా విమర్శించారు.

ఈ సదస్సులో క్వాడ్‌ దేశాధినేతలు ఈశాన్య, దక్షిణాసియా, పసిఫిక్‌ దీవుల్లో పరస్పర సహరాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. మారిటైమ్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ ట్రైనింగ్‌ ఇన్‌ ఇండో-పసిఫిక్‌(మైత్రి)ని క్వాడ్‌ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు.  ఇకపై ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని సముద్ర జలాల్లో భద్రత, అంతర్జాతీయ చట్టాల అమలు, చట్టవ్యతిరేక చర్యల నిర్మూలనకు చర్యలు తీసుకుంటారు.

ఇందుకోసం భారత్‌, అమెరికా, జపాన్‌ కోస్ట్‌గార్డులు, ఆస్ట్రేలియా సరిహద్దు దళం సంయుక్తంగా పనిచేస్తాయి. 2025లో మైత్రి శిక్షణ కార్యక్రమాలను భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. సముద్రాల్లో క్వాడ్‌ పోర్టులను ఏర్పాటు చేసి, పరస్పరం సహకరించుకోవాలని నలుగురు నేతలు సంకల్పించారు. దీనిపై ముంబైలో ‘క్వాడ్‌ ప్రాంతీయ పోర్టులు-రవాణా సదస్సు’ను నిర్వహించాలని నిర్ణయించారు. 

క్వాడ్‌ ఇండో-పసిఫిక్‌ లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంత నిపుణులకు ఇస్తున్న ఫెలోషి్‌పల సంఖ్యను 2,200కు పెంచాలని క్వాడ్‌ దేశాధినేతలు నిర్ణయించారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో సెమీకండక్టర్ల సప్లయ్‌ చైన్‌ ఏర్పాటు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.