భారతదేశం ఒక అవకాశాల స్వర్గం

భారతదేశం ఒక అవకాశాల స్వర్గం
అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించడానికి వీలుగా, తమ మూడో విడత పాలనలో మరింత సమున్నత లక్ష్యాలతో పని చేస్తున్నామని, ఇందుకోసం మూడింతల బలంతో ముందుకు సాగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశం ఒక అవకాశాల స్వర్గమని పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని నస్సావ్‌ వెటరన్స్‌ కొలోసియమ్​లో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మాట్లాడారు.
భారతదేశం ఇకపై అవకాశాల కోసం ఎదురుచూడదని స్పష్టం చేస్తూగత 10 సంవత్సరాలలో భారతదేశంలో ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం నిర్మించబడిందని ప్రధాని తెలిపారు. ప్రతిరోజూ రెండు కొత్త కాలేజీలు నిర్మిస్తున్నారని, ప్రతిరోజూ కొత్త ఐటీఐని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంటూ  10 ఏళ్లలో ఐఐఐటీల సంఖ్య 9 నుంచి 25కి పెరిగిందని ప్రధాని వెల్లడించారు.
ఇప్పటి వరకు భారతీయ డిజైనర్ల నైపుణ్యాన్ని ప్రపంచం చూసిందని ఇకపై భారతదేశం డిజైన్ వైభవాన్ని ప్రపంచం చూస్తుందని మోదీ తెలిపారు. ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రతి రంగంలోనూ సామాజిక, దేశాభివృద్ధికి దోహదపడతారని తెలిపారు. దేశం గర్వపడేలా చేయడంలో భారతీయ అమెరికన్ల పాత్రను మోదీ ప్రత్యేకంగా కొనియాడారు.

‘డెలావేర్‌లోని తన నివాసానికి బైడెన్‌ నన్ను తీసుకెళ్లారు. ఆయన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని స్పృశించింది. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. మీ విజయాల వల్లే ఈ గౌరవం సాధ్యమైంది” అంటూ ప్రవాస భారతీయులను ఉద్దేశించి స్పష్టం చేశారు. అమెరికాలో నివసిస్తున్న వేల మంది ప్రవాస భారతీయులే, భారతదేశానికి బ్రాండ్‌ అంబాసిడర్లు పేర్కొంటూ భారత్, అమెరికా కలిసి ప్రజాస్వామ్య పండగలో భాగస్వాములయ్యాయని చెప్పారు.

ప్రవాస భారతీయుల సదస్సులో, భారత్‌ డిజిటల్‌ విప్లవాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యూపీఐ, 5జీ నెట్‌వర్క్‌ అమలు జరుగుతున్న తీరును ఆయన వివరించారు. “5జీ నెట్‌వర్క్‌ అమలులో అమెరికా కంటే భారత్‌ ఎంతో ముందుంది. రెండేళ్లలోనే 5జీ నెట్‌వర్క్‌ దేశమంతటా అంతటా విస్తరించింది” అని తెలిపారు. 

డిజిటల్‌ వ్యాలెట్స్‌ను భారతీయులు ఇప్పుడు బాగా ఉపయోగిస్తున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ పేమెంట్స్‌ వ్యవస్థ ‘యూపీఐ’ భారత్‌లో ఉందని మోదీ చెప్పారు. ‘మేడిన్‌ ఇండియా సెమీకండక్టర్లు’ ప్రపంచ వ్యాప్తంగా విక్రయించడానికి ఎంతో దూరం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారతీయుల ‘నమస్తే’ అనే పదం ప్రపంచవ్యాప్తం అయిందని, ఆ పదం లోకల్‌ నుంచి గ్లోబల్‌కు వెళ్లిందని తెలిపారు.