
ఒలింపిక్స్ తరహాలో జరిగే ఫిడె చెస్ ఒలింపియాడ్‌లో భారత్ డబుల్ ధమాకా మోగించింది. 45వ చెస్ ఒలింపియాడ్‌లో అబ్బాయిలు స్వర్ణంతో చరిత్ర సృష్టించిన కాసేపటికే అమ్మాయిల బృందం కూడా పసిడితో రికార్డు నెలకొల్పింది. ఫైనల్ రౌండ్‌లో అజెర్‌బైజాన్ టీమ్‌పై గెలుపొంది.. ఈ టోర్నీ చరిత్రలో దేశానికి తొలిసారి స్వర్ణం అందించింది.
ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలి. దివ్యా దేశ్‌ముఖ్, వంతికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్ బృందం చెస్ ఒలింపియాడ్‌లో పసిడితో నవశకానికి నాంది పలికింది. 44వ ఒలింపియాడ్‌లో కాంస్యానికే పరిమితమైన అమ్మాయిలు ఈసారి సంచలన ఆటతో పసిడి వెలుగులు విరజిమ్మారు. బుడాపెస్ట్‌లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత పురుషుల బృందం చరిత్ర సృష్టించింది. ఆదివారం నల్ల పావులతో ఆడిన గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్ రష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్‌పై అద్భుత విజయంతో దేశానికి బంగారు పతకం సాధించి పెట్టాడు.
టోర్నీ ఆసాంతం గుకేశ్‌తో పాటు అర్జున్ ఎరిగేసి, ఆర్ ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, పీ హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్ (కెప్టెన్)లతో కూడిన బృందం అద్భుతంగా రాణించింది. రెండేండ్లకు ఓ సారి జరిగే ఈ టోర్నీలో 2022 లోకాంస్యంతో సరిపెట్టుకున్న భారత్‌కు ఈసారి స్వర్ణం దక్కడం గమనార్హం. 2014లోనూ ఇండియా కంచు మోత మోగించింది.
పురుషుల జట్టు స్లొవేనియాతో జరిగిన 11వ రౌండ్‌లో డి. గుకేశ్, అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానంద తమ తమ గేమ్‌లను గెలుపొందారు. వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్ ఓడించగా, జాన్ సుబెల్జ్‌పై ఇరిగేశీ, అంటన్ డెమ్చెంకోపై ప్రజ్ఞానంద విజయం సాధించారు. 45వ చెస్ ఒలింపియాడ్‌లో పురుషుల జట్టు తొలి ఎనిమిది రౌండ్‌లలో గెలిచి, తొమ్మిదో రౌండ్‌ను డ్రాగా ముగించింది. కీలకమైన పదో రౌండ్‌లో 2.5-1.5 తో బలమైన అమెరికాను మట్టికరిపించింది. చివరిదైన 11వ రౌండ్‌లో స్లొవేనియాపై పైచేయి సాధించింది.
మరోవైపు ఈ పోటీల్లో భారత మహిళల జట్టు కూడా తొలిసారి స్వర్ణంతో రికార్డు సృష్టించింది. 11వ రౌండ్‌లో 3.5-0.5 తో అజర్‌బైజాన్‌పై విజయం సాధించింది. డి. హారిక – దివ్య దేశ్‌ముఖ్ తమ తమ గేమ్‌లలో విజయం సాధించగా, ఆర్. వైశాలి గేమ్ను డ్రా గా ముగించింది. అనంతరం వంతిక అగర్వాల్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడం వల్ల మహిళల జట్టు విజయం ఖరారు చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో ఒకేసారి రెండు స్వర్ణాలు చేరాయి.
2020లో రష్యాతో కలిసి సంయుక్తంగా భారత్ స్వర్ణం గెలిచింది. ఇక 2021 పోటీల్లో భారత్ కాంస్యం సాధించింది. అయితే వర్చువల్‌గా జరిగిన టోర్నీల ఫలితాలను అధికారికంగా రికార్డుల్లో చేర్చలేదు. ఈసారి స్వర్ణం గెలవడం వల్ల భారత్కు అధికారికంగా ఇదే తొలి గోల్డ్ అయ్యింది. అంతే కాకుండా ఈసారి భారత్కు రెండు విభాగాల్లోనూ పసిడి పతకాలు రావడం కూడా విశేషం.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్