11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షకు సిద్ధమైన పవన్‌ కల్యాణ్‌

11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షకు సిద్ధమైన పవన్‌ కల్యాణ్‌
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేసిన అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని తెలిపారు. ఏడుకొండలవాడా.. నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వు అని వేడుకుంటానని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా తన మనసులోని బాధను వెల్లగక్కారు.

అమృతతుల్యంగా, పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని చెబుతూ విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని, ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. అపరాధభావానికి గురైందని, ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న తనకు ఇటువంటి క్లేశం ఆదిలోనే తన దృష్టికి రాకపోవడం బాధించిందని తెలిపారు. 

కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే తాను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానని వెల్లడించారు. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతానని తెలిపారు. 

11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని చెప్పారు. ‘దేవదేవా… నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటానని పేర్కొన్నారు. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. 

తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం తనను బాధిస్తుందని తెలిపారు. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోందని పేర్కొన్నారు. 

వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని చెప్పారు. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని తెలిపారు.