జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం హైదరాబాద్‌లో తనిఖీలు చేపట్టారు. సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు గంటపాటు సోదాలు నిర్వహించనట్లు తెలుస్తోంది. ఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
అతనికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తించింది. రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తరఫున పుణే నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని తేలింది. అతన్ని ఢిల్లీలోని గంగాబక్ష్ మార్గ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో రిజ్వాన్ నుంచి 30 బోర్ పిస్టల్, 3 కాట్రిడ్జ్‌లు, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత రిజ్వాన్‌పై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే రిజ్వాన్ తలపై రూ.3లక్షల రివార్డు ఉన్నది. అరెస్టు అనంతరం ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. రిజ్వాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే హైదరాబాద్‌లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తున్నది. సైదాబాద్ శంఖేశ్వర్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్లో రిజ్వాన్ కొద్దినెలలు ఉన్నాడని ఎన్ఐఏ విచారణలో తేలింది. ఈ క్రమంలో అతన్ని తీసుకొని వచ్చి సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
మరోవైపు.. ఇదే విషయంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో ఉగ్రవాదులను ఎంఐఎం పెంచిపోషిస్తోందంటూ ఆరోపించారు. దేశం మొత్తంలో ఎక్కడ ఉగ్రవాదులు దొరికినా వాళ్లలో ఎవరికో ఒకరికి పాతబస్తీతో లింక్ ఉంటుందని చెప్పుకొచ్చారు. పాతబస్తీని రోహింగ్యాలకు, టెర్రరిస్టులకు అడ్డాగా మార్చేస్తున్నారని ఆరోపించారు.
ఓవైసీ కుటుంబం అనుమతితోనే ఉగ్రవాదులు పాతబస్తీలో తలదాచుకుంటున్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాతబస్తీని ప్రక్షాళన చేసి న్యూసిటీగా మార్చేస్తామని స్పష్టం చేశారు.

More Stories
హోమ్ శాఖ కోసం పట్టుబడుతున్న అజారుద్దీన్!
చేవెళ్ల బస్సు ప్రమాదంలో 21 మంది బలి
జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతో కాంగ్రెస్ బెదిరింపులు