తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన బాసర శ్రీజ్ఞానసరస్వతి ఆలయంపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భారత దేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ ఆలయాల్లో ఒకటి కాశ్మీర్‌లో ఉండగా, రెండోవది బాసరలోనే ఉంది. బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మించారు.
అమ్మవారు దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఎంతో ప్రాధాన్యత గల ఈ పురాతన ఆలయం పట్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రి, వేములవాడ ఆలయాలకు ఇచ్చిన ప్రాధాన్యం లభించడం లేదు. బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మావారి ఆలయంలో నిత్యం భక్తులు రద్దీ ఉంటుంది. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.
కొందరు భక్తులు రాత్రి వేళ ఇక్కడ ఉండి తెల్లవారు జామున జరిగే పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వసంత పంచమి, దసరా రోజుల్లో వేలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. అలాంటి రోజుల్లో సుమారు ఆరేడు గంటలు క్యూలో ఉంటూ అమ్మవారిని దర్శించుకుంటుంటారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాసర ఆలయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటినా బాసర క్షేత్రం ఆలయ అభివృద్ధి మాత్రం గడపదాటలేదు. దేవాలయ అభివృద్ధికి 2018 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రూ. 50 కోట్లు కేటాయిస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ నిధులు మాత్రం విడుదల కాలేదు.
ఏమాత్రం వర్షం పడినా అమ్మవారి సన్నిధిలోని గర్భాలయంలో లీకేజీలు ద్వారా నీరు కిందకు పడుతుంది. ఏకధాటిగా వర్షాలు కురిస్తే చెరువుగా మారుతుంది. గర్భాలయంలో భక్తులపై నీరు పడకుండా ఆలయ అధికారులు టబ్బులను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాకార మండపం సైతం వర్షాలకు శ్లాబ్ నుంచి కూడా నీరు లీకేజీ ఉంటుంది.
గత ప్రభుత్వం ఆలయ ప్రాంగణంలో సుమారు రూ.8 కోట్లతో రెండు తాత్కాలిక షెడ్డులను నిర్మించారు. ఆలయ వసతి భవనాలపై ఏసీ వసతి భవనలు కూడా నిర్మించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మండపాలు, క్యూ కాంప్లెక్స్ లేక పోవడంతో భక్తులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆలయ క్యూ లైన్‌లో మరుగుదొడ్లు లేక మహిళ భక్తులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు.
అమ్మవారి సన్నిధిలో విశాలమైన ప్రత్యేక అక్షరాభ్యాస మండపలు, క్యూ కాంప్లెక్స్, గర్భాలయం వెడల్పు, కుంకుమార్చన మండపం ఏర్పాటు అయితే వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బందులు తొలగుతాయి. ఇందుకు కావలసిన ఆలయ భూమి కూడా అందుబాటులో ఉంది. కానీ నిధులు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు.
More Stories
అభ్యర్థుల ఎంపికకై ముగ్గురు సభ్యులతో బిజెపి కమిటీలు
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు
ఆమెరికాలో కాల్పులు.. హైదరాబాద్కి చెందిన విద్యార్థి మృతి