
రంగనాయక మెడికల్ కాలేజీ వైద్యులు, వైద్య విద్యార్థులతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ ప్రవర్తించిన తీరుపై జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఆయన్ను మందలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెనక్కి తగ్గిన నానాజీ క్షమాపణలు చెప్పారని సమాచారం. క్షణికావేశంలో దురదృష్టవశాత్తు అలా జరిగిపోయిందని ఎమ్మెల్యే చెప్పడంతో.. ప్రొఫెసర్ ఒకింత తగ్గారు.
కానీ వైద్య విద్యార్థులు మాత్రం తగ్గలేదు. దీంతో దాడికి గురైన డాక్టర్ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే నానాజీ ప్రవర్తించిన తీరు సరైన పద్ధతిలో లేకపోవడంతో అందరం బాధపడ్డామని తెలిపారు. రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సమ్మెలు చేయవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ ఘటనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇస్తామని, అప్పటికీ న్యాయం జరగకపోతే ధర్నాకు వెళ్దామని వైద్య విద్యార్థులకు తెలిపారు.
కాకినాడ రంగరాయ వైద్యకాలేజీకి శ్రీనగర్‌లో 12 ఎకరాల క్రీడా మైదానం ఉంది. ఇందులో సుమారు 150 గజాల్లో మెడికోల కోసం వాలీబాల్ కోర్టు ఉంది. మెడికల్ కాలేజీ అనుమతి లేకుండా బయటవాళ్లు ఈ గ్రౌండ్‌ను వినియోగించుకునేందుకు వీల్లేదు. కానీ కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ అనుచరులమంటూ సుమారు 40 మంది యువకులు వాలీబాల్ కోర్టుకు వస్తున్నారు.
పైగా వారు అక్కడి మెడికోలతో గొడవకు దిగుతున్నారు. అలాగే వైద్య విద్యార్థినులతో పాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలపై తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఆర్‌ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు మెడికోలు ఫిర్యాదు చేశారు. అలాగే మెడికల్ కాలేజీ యాజమాన్యంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు కాలేజీ గ్రౌండ్‌లోకి కొంతమంది బయట వ్యక్తులు వచ్చి వైద్య విద్యార్థులతో కవ్వింపు చర్యలకు దిగారు. ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్దన్, వైద్యులు, విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు.
అంతటితో ఆగకుండా ఈ డాక్టర్లు మిమ్మల్ని నోటికొచ్చినట్లు తిడుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శనివారం రాత్రి ఆయన మైదానానికి వెళ్లి డాక్టర్ ఉమామహేశ్వరరావును అసభ్యపదజాలంతో దూషించారు. ఆయనపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న మెడికల్ కాలేజీ యాజమాన్యం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!