చర్చి, మజీదులో ఇలా జరిగితే జగన్‌ ఊరుకుంటారా?

చర్చి, మజీదులో ఇలా జరిగితే జగన్‌ ఊరుకుంటారా?
తప్పులు చేసిన వారిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా సమర్థిస్తారని మండిపడుతూ చర్చిలో, మసీదులో ఇలా జరిగితే జగన్‌ ఊరుకుంటారా? అని జన సేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆయన నిలదీశారు.
 
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు, చేప నూనె కలిపి అపవిత్రం చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీయడాన్ని నిరసిస్తూ పవన్‌ కల్యాణ్‌ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను ఆదివారం చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతరా వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టిన పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు నిర్వమించారు.  
 
తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు.  చర్చి, మసీదులో జరిగితే ప్రపంచం అంతా గొడవ చేస్తారని అంటూ హిందువులకు మనోభావాలు ఉండవా? ఇతర మతాలకు అన్వయిస్తారా? అంటూ ప్రశ్నించారు. సనాతన ధర్మం ఒకరు ప్రారంభించింది కాదు. అన్ని విశ్వాసాలను దగ్గరకు తీసుకున్న నేల ఇదని చెప్పారు.
ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ  వైసీసీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని, రథాలను తగులబెట్టారని, ఆలయాలను అపవిత్రం చేశారని ఆరోపించారు. ఏ మతమైనా సరే వారి మనోభావాలు దెబ్బకూడదని ఆయన స్పష్టం చేశారు. సంస్కరణల పేరుతో 2019 నుంచి వైసీపీ చాలా మార్పులు తీసుకొచ్చిందని పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. 
 
తిరుమల శ్రీవారి పూజా విధానాలను సైతం మార్చేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10వేలు వసూలు చేసి.. బిల్లు మాత్రం రూ.500కే ఇచ్చారని మండిపడ్డారు. మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూను కూడా కల్తీ చేశారని తెలిసి ఆవేదన కలుగుతోందని చెప్పారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందని అస్సలు ఊహించలేదని తెలిపారు.
 
అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా? అని ప్రశ్నించారు. ఇదంతా జరుగుతుంటే వైవీ సుబ్బారెడ్డి, ధర్మా రెడ్డి ఏం చేశారని నిలదీశారు.  కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? అని పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.  కేబినెట్, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాలని, సీబీఐ విచారణకు ఇవ్వాలో లేదో సీఎం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు.  ప్రజలంతా ఆయన వెనుకే ఉంటారని అభిప్రాయపడ్డారు. నెయ్యి తక్కువ ధరకు ఇస్తారని చెప్పిన మధ్యవర్తి ఎవరో తేలాలని పవన్ అన్నారు.