
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిశీ ప్రమాణస్వీకారం చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అతిశీ చేత ప్రమాణం చేయించారు. కాగా, అతిశీ ప్రస్తుతం ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అతిశీతో పాటు గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇందులో ముకేశ్ అహ్లవత్ దళిత ఎమ్మెల్యే కాగా, తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతిశీ తల్లిదండ్రులు, ఆప్ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సందర్భంగా సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ మంత్రివర్గ శాఖల్లో కీలకమైన విద్య, ఆర్థిక శాఖలను అతిషి తనవద్దే పెట్టుకున్నారు. ఆ రెండు సహా 13 శాఖలకు ఆమె నేతృత్వం వహిస్తారు. కొత్త మంత్రుల్లో సౌరభ్ భరద్వాజ్ ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, సాంఘిక సంక్షేమంతో సహా ఎనిమిది శాఖలను నిర్వహిస్తారు. గోపాల్ రాయ్ కు పర్యావరణం సహా మూడు శాఖలు ఉంటాయి.
రవాణా, డబ్ల్యూసీడీ సహా నాలుగు శాఖల బాధ్యతలను కైలాష్ గెహ్లాట్ చేపట్టనున్నారు. ఇమ్రాన్ హుస్సేన్ ఫుడ్ సప్లై అండ్ ఎలక్షన్ డిపార్ట్ మెంట్ కు నేతృత్వం వహిస్తారు. ముఖేష్ అహ్లావత్ ఢిల్లీ ఎస్సీ, ఎస్టీ మంత్రిగా, కార్మిక శాఖతో పాటు మరో నాలుగు శాఖలను చేపట్టనున్నారు.
ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతిశీ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు. దేశంలో 17వ మహిళా ముఖ్యమంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. కాంగ్రెస్‌కు చెందిన షీలాదీక్షిత్, బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ తరువాత ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా అతిశీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం దేశంలో మమతా బెనర్జీ ఒక్కరే మహిళా సీఎం కాగా, రెండో సీఎంగా అతిశీ నిలిచారు. అంతేకాదు, ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కురాలు (43)గా కూడా అతిశీ నిలిచారు.
సలహాదారు పదవి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన అతిశీ అతి చిన్న వయసులోనే అత్యధిక శాఖలు నిర్వహించిన మహిళగా ఖ్యాతి పొందారు. ఆప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా పార్టీ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2013లో ఆప్‌లో చేరిన అతిశీ అదే ఏడాది పార్టీ ప్రణాళిక ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 2020లో కల్కాజీ నుంచి గెలుపొందారు.
గత ఏడాది ఫిబ్రవరిలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టయిన సంక్షోభ పరిస్థితుల్లో ఆమె మంత్రి పదవిని చేపట్టారు. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను చేపట్టిన అతిశీ.. సీఎం జైలుకెళ్లినప్పుడు అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఏకతాటిపై నిలిచారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!