ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి ఊరట

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి ఊరట
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసును వేరే కోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.  కేసును బదిలీ చేయాలని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును భోపాల్‌కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. 

ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని, స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ వేశారని, సిఎం, హోంమంత్రిగా ఉన్న రేవంత్‌కు ఎసిబి డిజి రిపోర్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేయాలని సూచనలు చేసింది. ఓటుకు నోటు కేసు విచారణలో సిఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

కేసు విచారణపై విశ్రాంత జడ్జి పర్యవేక్షణను నిరాకరించింది. భవిష్యత్‌లో సిఎం జోక్యంపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది.  విచారణ సందర్భంగా రేవంత్‌రెడ్డికి కోర్టు పలు సూచనలు చేసింది. తమ తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉందని, ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని హితవు చెప్పారు. తన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టును రేవంత్ రెడ్డి క్షమాపణ కోరారు. 

ఢిల్లీ మధ్యం కేసులో ఎంఎల్‌సి కవిత బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిలు, లాయర్లపై సిఎం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో సుప్రీం అనుమతి ఇచ్చింది. ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం విచారణ ముగించింది.

2015లో తెలంగాణలో ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎంఎల్‌సి ఎన్నిక కోసం టిడిపికి మద్దతు తెలపాలంటూ నామినేటెడ్ ఎంఎల్‌ఎ స్టీఫెన్‌సన్ మద్దతును ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరే సందర్భంలో సూట్‌కేసులతో రూ. 50 లక్షలు ఇస్తూ కెమెరాకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన విషయం తెలిసిందే.  

ఆ సమయంలో స్టీఫెన్‌సన్‌ను రేవంత్ రెడ్డి కలిసి డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలుశిక్షను కూడా అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రాగా తర్వాత పరిణామాలతో ఈ కేసు కాస్త మరుగున పడిపోయింది.