తిరుమల లడ్డూ వివాదంపై నివేదిక కోరిన జెపి నడ్డా

తిరుమల లడ్డూ వివాదంపై నివేదిక కోరిన జెపి నడ్డా
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వార్తలపై తీవ్రంగా స్పందించింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. ఈ మేరకు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని కేంద్ర మంత్రి నడ్డా కోరారు.

లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపించాల్సిందిగా కోరినట్లు వివరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ అంశంలో ఫుడ్ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థ సారధితో పాటు ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. 

లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలపై సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్​లతో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.

 ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా  రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ అభివర్ణించారు. ఓ ఆంగ్ల వార్తా సంస్థతో ఆచార్య సత్యేంద్ర దాస్‌ మాట్లాడుతూ.. తిరుమల బాలాజీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వెళ్లి.. లడ్డూను ప్రసాదంగా స్వీకరిస్తుంటారని చెప్పారు. 

ఇప్పటి వరకూ జరిగిన పరిశీలనలో మహా ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూలో చేపనూనె వంటివి కలిసినట్లు తేలిందని,  ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు తిరుమల ప్రసాదంలో కల్తీ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చంద్రబాబుకు లేఖ రాశారు. ఇది ఎంత మాత్రం క్షమించరాని నేరమని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ప్రజల విశ్వాసం మీద జరిగిన దాడిగా బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. వ్యాపారం కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ సైతం దీనిపై విచారణ చేయాలని కోరారు. 

 
కాగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని వినీత్ జిందాల్ మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను దారుణంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా, కావాలనే ఇలాంటి చర్యలకు జగన్ మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలోనే జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖతో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జగన్‌తో పాటు అప్పటి టీటీడీ పాలకవర్గం, జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత న్యాయ సంహితలోని 152, 192, 196, 298, 358 సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.