తెలంగాణలో వరద నష్టం రూ.10,320 కోట్లు

తెలంగాణలో వరద నష్టం రూ.10,320 కోట్లు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో అపార నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  
 
తెలంగాణాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని  ఆయన కోరారు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని తెలిపారు. 
 
రాష్ట్రంలో భవిష్యత్తులో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న నిబంధనలు చూస్తే.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్ఎఫ్ లో అందుబాటులో ఉన్న రూ.1350 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేంద్ర అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని సీఎం రేవంతి రెడ్డి చెప్పారు. వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

రాకాసి తండా, సత్యనారాయణ తండాతో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు.