
* కమిషనర్ తో సహా ముగ్గురిపై కేసు నమోదు
హైకోర్టు ఆదేశంతో కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు క్రైమ్ నెం 480/2024 25, 420, 406 r/w 34 ఐపీసీ సెక్షన్ క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదుతో అటు బల్దియా అధికారులను, ఇటు పాలకవర్గాన్ని ఇరకాటంలో పడేస్తుంది.
ప్రభుత్వం మారడంతో పలచబడుతున్న బీఆర్ఎస్ పార్టీకి బల్దియాలో అవినీతిపై మాజీ మేయర్ ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు నోరు మెదపని పాలకవర్గం కార్పొరేటర్లు ఇప్పుడు నిధుల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పాలకవర్గం కార్పొరేటర్లతో పాటు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సైతం బల్దియాలో జరిగిన అవినీతిపై బహిరంగంగా విమర్శలు చేయడమే కాదు ఏకంగా మాజీ మేయర్ పోలీసులకు పిర్యాదు చేశారు.
స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. ఆధారాలతో కూడిన ఫిర్యాదును అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారని, వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరీ చేసిన ఈ పథకం అమలులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయిస్తుందని, ఈ నిధులను కేవలం నగర పరిధిలో మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని నిబంధనల్లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. నగరంలో నిధులను వేరే పనులకు మళ్లించి పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిసిందని, నిధుల దుర్వినియోగం చట్టంలో శిక్షార్హమైనదని రవీందర్ సింగ్ వివరించారు.
నగరాన్ని ఆనుకుని ఉన్న బొమ్మకల్ జంక్షన్ అభివృద్ధి కోసం 2022 ఆగస్టు8న టెండర్లు పిలిచారు. బొమ్మకల్ గ్రామం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లేదు. స్మార్ట్ సిటీ పనుల పరిధిలోకి రాదని రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. ఇదంతా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ (పిఎంసీ), మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్ కలిసి కరీంనగర్ స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఉద్దేశించిన నిధులను పక్కదారి పట్టించేందుకు పథకం పన్నారని రవీందర్ సింగ్ ఆరోపించారు.
నగరానికి సంబంధించిన నిధులతో గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్దమని స్పష్టం చేశారు. సదరు టెండర్ల ద్వారా పనులు పొందిన కాంట్రాక్టర్ ఇప్పటికే 25 శాతం పనులు పూర్తి చేసి నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఇందుకు కారణమైన మున్సిపల్ కమిషనర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీతో పాటు ఈ అక్రమాల్లో పాలుపంచుకున్న ఇతరులపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని రవీందర్ సింగ్ వన్ టౌన్ పోలీసులకు గత జులై 3న ఫిర్యాదు చేశారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ స్మార్ట్ సిటీ హోదా లభించిన తర్వాత నగర అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ నిధులతో అధికారులు నగరంలోని డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కానీ నామమాత్రంగా నగరాన్ని అభివృద్ధి చేసిన అధికారులు స్మార్ట్ సిటీ నిధులను గ్రామపంచాయతీలకు తరలించడం వెనుక బడా నేతల ప్రమేయం ఉందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన