పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు నిరాకరించిన జూనియర్ డాక్టర్లు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాలను వారు కోరారు. బెంగాల్ జూనియర్ డాక్టర్ల సంఘం ఈ మేరకు వారికి లేఖలు పంపింది.
తమ ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరింది. ఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడంతో పాటు హత్య జరిగింది. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కాగా, బెంగాల్‌లోని జూనియర్ డాక్టర్లు నాటి నుంచి విధులకు దూరంగా ఉండి నిరసన కొనసాగిస్తున్నారు.
సుప్రీంకోర్టు అల్టిమేటమ్‌తోపాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినప్పటికీ స్పందించలేదు. దీంతో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ లేఖలు రాసింది.
బెంగాల్ ప్రభుత్వంతో కొనసాగుతున్న ప్రతిష్టంభనలో జోక్యం చేసుకోవాలని కోరింది. మరోవైపు బాధిత ట్రైనీ డాక్టర్‌కు న్యాయం జరుగాలని జూనియర్ డాక్టర్లు ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో భయం లేకుండా ప్రజలకు తమ విధులను నిర్వర్తించలేక పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ కష్ట సమయాల్లో మీ జోక్యం మాకందరికీ వెలుగునిస్తుంది. మా చుట్టూ ఉన్న చీకటి నుంచి బయటపడే మార్గాన్ని చూపుతుంది’ అని నాలుగు పేజీల లేఖలో పేర్కొన్నారు.
‘అత్యంత హీనమైన నేరానికి గురైన దురదృష్టవంతురాలైన మా సహచరికి న్యాయం లభించడానికి, పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ కింద ఆరోగ్య సేవల వృత్తి నిపుణలమైన మేము ఎటువంటి భయాందోళనలూ లేకుండా ప్రజల కోసం మా విధులు నిర్వర్తించగలిగడానికి వీలు కల్పిస్తూ గౌరవనీయులైన ప్రభుత్వ అధిపతుల ముందు మా సమస్యలను వినయపూర్వకంగా ఉంచుతున్నాం. ఈ జటిల సమయంల మీ జోక్యం మా అందరికీ ఆశాకిరరమై మమ్మల్ని అంధకారం నుంచి వెలుగులోకి తీసుకువస్తుందని ఆశిస్తున్నాం’ అని వారు రాశారు.
లేఖను ఈ నెల ఆరంభంలోనే రాసినట్లు, గురువారం రాత్రి పంపినట్లు నిరసనకారులైన డాక్టర్లలో ఒకరైన అనికేత్ మహతో చెప్పారు. కాగా, డాక్టర్ల సమ్మె కారణంగా వైద్యం అందక మరణించిన 29 మంది కుటుంబాలను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మరణించిన ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని ప్రకటిస్తూ ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు