14 నుంచి నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌

14 నుంచి నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ సెమీ హైస్పీడ్‌ రైళ్లు  ప్రస్తుతం సికింద్రాబాద్‌కు రైల్వేశాఖ రెండు కేటాయించింది. ఇందులో సికింద్రాబాద్‌- తిరుపతి- సికింద్రాబాద్‌, కాచిగూడ- యశ్వంత్‌పూర్‌- కాచిగూడ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు సైతం మరో రైలు నడుస్తున్న విషయం తెలిసిందే. 
 
త్వరలో సికింద్రాబాద్‌కు మరో రైలు రానున్నది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు ఈ రైలు నడవనున్నది. ఈ నెల 14న ప్రధాని నరేంద్ర మోదీ రైలుకు ప్రారంభోత్సవం చేయనున్నారు. దీంతో పాటు తొమ్మిది రైళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు.  నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ రైలుతో పాటు టాటానగర్‌- పాట్నా, బర్హంపూర్‌- టాటానగర్‌, రూర్కెలా-హౌరా, డియోఘర్‌-వారణాసి, ఆగ్రా క్యాంట్‌ – బెనారస్‌, రాయ్‌పూర్‌- విశాఖపట్నం, గయా- హౌరా, భగల్‌పూర్‌- హౌరా, వారణాసి- డియోఘర్‌ మార్గాల్లో కొత్తగా రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తే నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణ సమయం తగ్గనున్నది. రెండు నగరాల మధ్య 578 కిలోమీటర్ల ఉండగా.. రైలు 7.15 గంటల్లోనే గమ్యస్థానం చేరనున్నది. నాగ్‌పూర్‌లో రైలు ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. 

తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్‌ చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. ఈ రైలు కాజీపేట్‌, రామగుండం, బల్హర్షా, చంద్రాపూర్‌, సేవ్‌గ్రామ్‌ స్టేషన్లలో ఆగనున్నది రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి మహారాష్ట్ర, తెలంగాణ మధ్య వేలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.

ఎక్కువగా వివిధ వ్యాపారాల నిమిత్తం నాగ్‌పూర్‌ ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ మార్గంలో సెమీహైస్పీడ్‌ రైలును నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తే రెండురాష్ట్రాల మధ్య కనెక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉన్నది.  ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వరకు పలు రైళ్లు నడుస్తున్నాయి. ఇవన్నీ సికింద్రాబాద్‌ మీదుగా ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. వందే భారత్‌ రైలు కేవలం రెండు నగరాల మధ్యనే రాకపోకలు సాగించనున్నది.