మసీదు అక్రమ నిర్మాణ భాగాన్ని మేమే కూల్చివేస్తాం

మసీదు అక్రమ నిర్మాణ భాగాన్ని మేమే కూల్చివేస్తాం
హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో అక్రమంగా మసీదు నిర్మించారంటూ నిరసనలు వెల్లువెత్తడంపై ముస్లిం కమిటీ స్పందించింది. మసీదు అక్రమ నిర్మాణ భాగాన్ని తామే కూల్చివేస్తామని పేర్కొంది. సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది.
 
సిమ్లాలోని సంజౌలి ప్రాంతంలోని మసీదును అక్రమంగా నిర్మించినట్లు హిందూ సంఘాలు ఆరోపించాయి. దేవ్ భూమి సంఘర్ కమిటీ పిలుపుమేరకు బుధవారం ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడంతోపాటు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు. మహిళలు, పోలీసులతో సహా సుమారు పది మంది గాయపడ్డారు.

కాగా, ఈ సంఘటన నేపథ్యంలో ముస్లిం సంక్షేమ కమిటీ ప్రతినిధులు గురువారం సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూపేందర్ కుమార్ అట్రీని కలిశారు. అనధికారిక భాగాన్ని సీల్ చేయాలని కోరారు. అలాగే కోర్టు తీర్పునకు అనుగుణంగా అక్రమ నిర్మాణాన్ని తామే కూల్చివేస్తామని తెలిపారు. ఈ మేరకు మెమోరాండం సమర్పించారు.

మరోవైపు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలు హిమాచల్ ప్రదేశ్‌లో శాశ్వత నివాసితులని ముస్లిం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మత సామరస్యం, సోదరభావాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముస్లిం సంక్షేమ కమిటీ సభ్యుడు ముఫ్తీ మహ్మద్ షఫీ కాస్మీ మీడియాతో అన్నారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన చెప్పారు.

కాగా, మసీదులో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చిన దేవ్ భూమి సంఘర్ కమిటీ ఈ చర్యను స్వాగతించింది. ‘ముస్లిం సమాజం చర్యను మేం స్వాగతిస్తున్నాం. పెద్ద ఆసక్తితో ఈ చొరవ తీసుకున్నందుకు వారిని కౌగిలించుకునే మొదటి వ్యక్తి నేనే అవుతా’ అని కమిటీ సభ్యుడు విజయ్ శర్మ తెలిపారు.