రెడ్‌బుక్‌ మీకే సొంతం అనుకోవద్దు

రెడ్‌బుక్‌ మీకే సొంతం అనుకోవద్దు

* అధికార పార్టీ నాయకులకు వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

ఏపీలో టీడీపీ నాయకులు అమలు చేస్తున్న రెడ్‌ బుక్‌ మీకే సొంతమని అనుకోవద్దని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి హెచ్చరించారు.  మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. టీడీపీ నాయకులు జైలుకు వెళ్లక తప్పదని అధికార టీడీపీ నాయకులను హెచ్చరించారు. గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ను పరామర్శించిన అనంతం జైలు బయట మీడియాతో మాట్లాడారు.

రెడ్‌ బుక్‌ పేరిట తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారని, ఈ తప్పుడు సంప్రదాయం రాబోయే రోజుల్లో సునామీలా వస్తుందని, ఆరోజు ఇదే జైల్లో మీవాళ్లందరూ ఉంటారని హెచ్చరించారు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, ఇవన్నీ తాత్కాలికమే, మీరు భూస్థాపితం అయ్యే రోజులు వస్తాయని తేల్చి చెప్పారు. విజయవాడ వరదలను డైవర్ట్‌ చేయాలని బోటు వివాదం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు.

ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లను రాజకీయం చేయాలని చూస్తున్నారని, బోట్లకు అనుమతి ఇచ్చింది చంద్రబాబేనని విమర్శించారు. చంద్రబాబు సీఎం కాగానే ఈ బోట్లతో విజయోత్సవ ర్యాలీలు చేపట్టారని పేర్కొన్నారు. నాలుగు నెలల నుంచి బోట్లు అక్కడే ఉన్నాయని, బోటు నిందితుడు ఉషాద్రి టీడీపీకి చెందిన వ్యక్తేనని ఆరోపించారు.

రాష్ట్రానికి తుఫాన్‌ వస్తుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించినా కూడా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష చేయలేదని గుర్తు చేశారు. హోంశాఖ లోతట్టు ప్రాంతాల్లోని వారికి అలర్ట్‌ జారీ చేయాల్సి ఉండగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. మీ సూపర్‌ సిక్స్‌ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని , రెవెన్యూ శాఖ రిలీఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.