
తెలంగాణలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రా ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 23 ప్రాంతాల్లో 262 అనధికారిక నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల స్థలాన్ని పరిరక్షించినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
గత రెండు నెలలుగా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల పనిపడుతున్న హైడ్రా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. రాంనగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా తెలిపింది.
అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది. హైడ్రాకు ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని సైతం కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. ఈ సిబ్బంది కేటాయింపుతో ఆక్రమణల తొలగింపు చర్యలు మరింత వేగవంతం కానున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం చెరువులు చెరపట్టిన వారికి చెరసాల తప్పదని హెచ్చరించారు.
కబ్జాదారులు ఎంత గొప్ప వ్యక్తులైనా వదిలిపేట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని చెప్పారు. పేదల పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని, 11,000ల మంది బాధితులకు రెండు పడక గదుల ఇండ్లు ఇస్తామని రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హైడ్రాను రీజినల్ రింగ్ రోడ్ వ రకు విస్తరించి ఔటర్ వెలుపల ఉన్న చెరువులను కాపాడే దశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి