మద్యం మత్తులో గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి

మద్యం మత్తులో గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి
ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న జూనియర్‌ డాక్టర్‌పై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. గాంధీ ఆస్పత్రి ఎమ్జెన్సీ విభాగంలో విధి నిర్వహణలో ఉన్న జూనియర్‌ డాక్టర్‌పై చికిత్స కోసం వచ్చిన రోగి దాడికి పాల్పడ్డాడు.
క్యూ లైన్‌లో వెయిట్ చేస్తూ అటుగా వెళుతున్న మహిళ డాక్టర్‌ చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. వైద్యురాలి యాప్రాన్‌ పట్టుకుని గుంజడంతో ఆమె భయాందోళనకు గురైంది.  వైద్యురాలిపై వృద్ధుడు దాడి చేయడం గమనించిన అక్కడున్న ఇతర వైద్యులు, సిబ్బంది రోగి చేతుల్లోంచి వైద్యురాలిని విడిపించారు.
గాంధీ ఆస్పత్రి అధికారులు, జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ వివరాల ప్రకారం బన్సీలాల్‌పేటకు చెందిన జీ.ప్రకాశ్‌ (60) కూలీ పనులు చేస్తుంటాడు. అతిగా మద్యం సేవించడంతో పాటు కల్లు తాగే అలవాటుతో ఇటీవల పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు.  బుధవారం ఫూటుగా మద్యం సేవించి, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో ప్రకాశ్‌ భార్య వైద్యసేవల నిమిత్తం గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగానికి తీసుకు వచ్చింది.
భార్యతో పాటు వైద్యం కోసం వేచి ఉన్న ప్రకాశ్‌ ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఓ వైద్య విద్యార్థిని చేయి పట్టుకుని గట్టిగా లాగాడు. ఆమె యాప్రాన్‌ పట్టుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు.  బాధితురాలు ఆందోళనతో గట్టిగా కేకలు వేయడంతో గమనించిన వైద్యులు, వైద్య సిబ్బంది అతడి చేతుల్లోంచి బలవంతంగా అతి కష్టంపై ఆమెను విడిపించారు.
ప్రకాశ్‌ వైద్యురాలిపై దాడి చేస్తున్న దృశ్యాలు అత్యవసర విభాగంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆస్పత్రి వర్గాల సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని గాంధీ ఆస్పత్రి పోలీస్‌ అవుట్‌పోస్ట్‌కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి చిలకలగూడ ఠాణాకు తరలించారు. నిందితుడు అతిగా మద్యం సేవించడం అలవాటుగా మారడంతో మతి స్థిమితం కోల్పోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజకుమారి దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యురాలిపై దాడి ఘటనను జూనియర్‌ డాక్టర్ల సంఘం గాంధీ యూనిట్‌ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు.

వైద్యులు, వైద్య విద్యార్థులపై దాడులు జరగకుండా, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని జూడా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వంశీకృష్ణ, లౌక్య, గిరిప్రసాద్‌లు డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి ఘటనపై కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.