
జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సైన్యం, పోలీసుల ప్రత్యేక బృందం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆర్మీకి చెందిన పారా మిలటరీ, 22 గర్హ్వాల్ రైఫిల్స్, కేంద్రపాలిత ప్రాంత పోలీసులకు ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
ఉదంపూర్, కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారానికి సంబంధించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భారీ వర్షాలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు.
ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని సైన్యం పౌరులకు విజ్ఞప్తి చేసింది. హతమైన ఉగ్రవాదుల నుంచి ఎం4 రైఫిల్, ఏకే రైఫిల్, పిస్టల్ సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఈ నెల 18 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో పాక్ బలగాలు అకారణంగా జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం సైనికుడు గాయపడ్డాడు. సైనికులు అప్రమత్తంగా ఉన్నారని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో కాపలా కాస్తున్న బీఎస్ఎఫ్ పేర్కొంది. ఈ సరిహద్దు సుమారు 3,323 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్