
ప్రకాశం బ్యారేజ్ గేట్లను గత సోమవారం నాలుగు బొట్లు ఢీకొన్న ఘటన వెనుక వైసిపి నాయకుల కుట్రకోణం ఉండవచ్చని ప్రభుత్వంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి నిమ‌్మల రామానాయుడు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరపాలని నీటిపారుదలశాఖ ఈఈ కృష్ణారావు విజయవాడ ఒకటవ టౌన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈనెల 1న తెల్లవారుజామున మొత్తం 5 పడవలు బ్యారేజీ గేట్ల వద్దకు వచ్చాయని ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. వాటిలో చిన్న పడవ బ్యారేజీ గేటు దాటి వెళ్లిపోయిందని మరో నాలుగు గేట్ల వద్ద ఉన్నాయని,వీటిలో మూడు భారీ మర పడవలు ఉన్నాయని చెప్పారు. వీటితోనే నదిలో ఇసుకను తోడుతుంటారని తెలిపారు. అందులోని మూడు పడవలు గేట్లను తగిలి గట్టిగా ఢీ కొట్టడంతో మూడు కౌంటర్ వెయిట్ దిమ్మెలు ధ్వంసమైనట్లు ఫిర్యాదులు వివరించారు.
అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది? ఆ సమయంలో బ్యారేజీపై విధుల్లో ఎవరున్నారు? అనే విషయాలను పోలీసులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మూడు పడవలు గొల్లపూడి, సూరాయపాలెం వ్యక్తులకు చెందినట్లు సమాచారం. పడవలపై వైఎస్సార్సీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మూడు పడవలు వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్ అనుచరులవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా మూడు పడవలు విడివిడిగా గొలుసులతో కడతారు. అయితే ఆ మూడింటిని ఒకే గొలుసుతో కట్టేశారని ఆరోపణలు వస్తున్నాయి. పడవలను ఎవరైనా కావాలని వదిలేశారా?లేక నదీ ప్రవాహానికి కొట్టుకొచ్చాయా అనే విషయాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పడవ యజమానులను గుర్తించి వారి నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
కాగా, ఆ బోట్లు వైసిపి నాయకులకు చెందినవే అని, వాటికి వైసిపి రంగులు కూడా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆ బొట్లు ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించి ఉంటె పెద్ద ఉపద్రవంకు దారితీసేదాని అంటూ ఉద్దేశ్యపూర్వకంగా, కుట్రపూరితంగా ఆ బోట్లను వదిలారని ఆయన స్పష్టం చేశారు. బ్యారేజీని ఢీ కొట్టిన పడవలకు ఎటువంటి అనుమతులు కూడా లేవని, ఇసుక తోలే భారీ పదవులను తీసుకొచ్చి వదిలారని ఆయన తెలిపారు.
మరోవంక, బుడమేరు వాగులు వైసిపి నాయకులు విచ్చలవిడిగా ఇసుక, మట్టిలను అక్రమంగా అమ్ముకున్న కారణంగానే గండ్లు తెగి, విజయవాడ ముంపుకు కారణమైనది ఆయన విమర్శించారు. నాలుగు రోజులపాటు ఈ గండ్లను పూడ్చేందుకు తాము శ్రమించవలసి వచ్చిమదని ఆయన గుర్తు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే బుడమేరుకు ఈ పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత సోమవారం రోజున కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి నాలుగు ఇనుప బోట్లు కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్ వెయిట్ తగలడంతో అవి దెబ్బతిన్నాయి. 64వ నంబరు గేటు వద్ద ఉండే వెయిట్ స్వల్పంగా దెబ్బతినగా 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్ సిమెంట్ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి.
ఇందులో ఒక బోటు 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్ వెయిట్‌ను ఢీ కొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీ కొని మరో రెండు బోట్లు ఆగిపోయాయి. మరో బోటు 64వ నంబరు ఖానా వద్ద ఉన్న కౌంటర్ వెయిట్‌ను ఢీ కొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ బోటూ ఇక్కడ ఇరుక్కుపోయింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన