పూజా కేడ్కర్‌ సర్వీసు నుంచి తొలగింపు

పూజా కేడ్కర్‌ సర్వీసు నుంచి తొలగింపు
వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్‌సీ రద్దు చేసిన కొద్ది వారాలకు కేంద్రం తాజా చర్యలు తీసుకుంది.
 
దీంతో ఇకపై ఐఏఎస్ గా కానీ ట్రైనీ ఐఏఎస్ గా కానీ చెప్పుకోవడానికి కూడా పూజా ఖేడ్కర్ కు అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికే నకిలీ గుర్తింపుతో ఐఏఎస్ కు ఎంపికైన వ్యవహారంలో ఆమెపై యూపీఎస్సీ క్రిమినల్ కేసు పెట్టడంతో విచారణ జరుగుతోంది. ఐఏఎస్ రూల్స్ 1954 కింద ఆమెను ఐఏఎస్ నుంచి తొలగించినట్టు కేంద్రం పేర్కొంది.
రూల్-12 కింద ప్రొబేషనర్లు రీ-ఎగ్జామినేషన్‌లో ఫెయిల్ అవడం, ఐఏఎస్ సర్వీసుకు రిక్యూట్‌మెంట్‌కు అనర్హురాలిగా గుర్తించడం, సర్వీసులో కొనసాగడానికి తగరని భావించిన పక్షంలో వారిని తొలగించే అధికారం కేంద్రానికి ఉంటుంది.
 
పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె తప్పుడు అఫిడవిట్‌లతో యూపీఎస్‌సీ పరీక్షలను క్లియర్ చేసినట్టు వెలుగుచూడటంతో చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన యూపీఎస్‌సీ ఆ ఆరోపణలు నిజమని కనుగొనడంతో షోకాజ్ నోటీసు ఇచ్చింది.
ఫోర్జరీ కేసు నమోదు కావడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో పాటు భవిష్యత్‌లో పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది. యూపీఎస్‌సీ నిర్ణయాన్ని హైకోర్టులో ఖేడ్కర్ సవాలు చేశారు.  తనపై అనర్హత వేటు వేసే అధికారం యూపీఎస్‌సీకి లేదని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)కు మాత్రమే ఉందని ఆమె వాదించారు. ఈ క్రమంలో కేంద్రం తాజా చర్యలకు దిగింది.