న‌లిమెల భాస్క‌ర్‌కు ప్ర‌జాక‌వి కాళోజీ పుర‌స్కారం

న‌లిమెల భాస్క‌ర్‌కు ప్ర‌జాక‌వి కాళోజీ పుర‌స్కారం
పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త‌, బ‌హుభాషా కోవిదుడు, క‌వి, ర‌చ‌యిత‌, అనువాద‌కుడు న‌లిమెల భాస్క‌ర్‌ను వరించింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రభుత్వం ప్రతి ఏడాది అవార్డు అందిస్తుంటుంది. 
 
ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వం న‌లిమెల భాస్క‌ర్‌ను ఎంపిక చేసింది. ఈ నెల 9న కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో భాస్క‌ర్‌కు ‘కాళోజీ’ అవార్డు అందిస్తారు. అవార్డు కింద రూ. 1,01,116 నగదు రివార్డు, జ్జాపిక అందించి శాలువతో సత్కరించ‌నున్నారు.

1956, ఏప్రిల్ 1న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ‌లం నారాయ‌ణ‌పూర్‌లో న‌లిమెల భాస్క‌ర్ జ‌న్మించారు. 2013 సంవ‌త్స‌రానికి గాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డును ఆయ‌న పొందారు. మ‌ల‌యాళ ర‌చ‌యిత పుణ‌త్తిల్ కుంజ‌బ్దుల్లా ర‌చించిన స్మార‌క శ‌శిగ‌ల్ న‌వ‌ల‌ను న‌లిమెల భాస్క‌ర్ స్మార‌క శిల‌లు పేరుతో తెలుగులోకి అనువ‌దించారు. రాష్ట్ర‌, జాతీయ స్థాయిలో భాస్క‌ర్ ప‌లు అవార్డులు అందుకున్నారు.

ప్రతి ఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికిగాను ప్రముఖకవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌ను వరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత నాటి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తి ఏడాది కాళోజీ జ‌యంతి సంద‌ర్భంగా సాహిత్య‌, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కాళోజీ నారాయ‌ణ రావు అవార్డును అంద‌జేయ‌డం ప్రారంభించారు.