
గతేడాది జనవరిలో చేపట్టిన మహిళా రెజ్లర్ల నిరసనల వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే మహిళా రెజ్లర్లు నిరసనలు చేశారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బిజెపి మాజీ ఎంపీ బ్రిజ్ భ్రూషణ్ ఆరోపించారు. శుక్రవారం భారత రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆ వెంటనే వినేశ్ ఫోగట్‌ను జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బరిలో దింపింది. భజరంగ్ పూనియాను కిసాన్ కాంగ్రెస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ శనివారం మీడియాతో మాట్లాడారు.
‘గతేడాది జనవరి (2023 జనవరి 18)లో రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనలు చేశారు. క్రీడాకారుల నిరసనల వెనుక కాంగ్రెస్ ఉందని నేను అప్పుడే చెప్పాను. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే రెజ్లర్లు మాకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ప్రత్యేకించి కాంగ్రెస్ సీనియర్ నేతలు భూపేందర్ హుడా, దీపేందర్ హుడా, ప్రియాంక జీ, రాహుల్ జీ నేతృత్వంలోనే రెజ్లర్లు అప్పుడు నిరసనలు చేశారు’ అని స్పష్టం చేశారు.
`ఆ నిరసనల వెనుక కాంగ్రెస్ ఉందనడానికి ఇప్పుడు వినేశ్, బజరంగ్ పునియాలు ఆ పార్టీలో చేరడమే సాక్ష్యం. భూపేందర్ హుడా, దీపేందర్ హుడాల వల్ల హర్యానా కుమార్తెలు ఇబ్బంది పడుతున్నారు. బజరంగ్, వినేశ్‌లు ఎన్నికల్లో పోటీ చేయడం.. ఆడపిల్లల గౌరవం కోసం కాదు.. రాజకీయాల కోసమే అని నేను హర్యానా ప్రజలకు ప్రత్యేకించి చెప్పాలనుకుంటున్నాను’ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
రెజ్లర్లు ఇద్దరూ క్రీడను దెబ్బతీశారని, ముఖ్యంగా మహిళా రెజ్లర్లను అగౌరవపరిచారని ఆయన విచారం వ్యక్తం చేశారు. “వారు నాకు హాని కలిగించడమే కాకుండా క్రీడకు హాని కలిగించారు. మహిళా అథ్లెట్లను అవమానించారు” అని ఆయన ధ్వజమెత్తారు. “నేను కూతుర్లను అగౌరవపరచే తప్పు చేయలేదు.. ఎవరైనా కూతుళ్లను అగౌరవపరిచే పనికి పాల్పడితే అది బజరంగ్, వినేష్.. దానికి స్క్రిప్ట్ రాసిన భూపీందర్ హుడా బాధ్యత వహిస్తాడు. ఏదో ఒక రోజు కాంగ్రెస్ అంటూ పశ్చాత్తాపపడాల్సి వస్తుంది” అని ఆయన తేల్చి చెప్పారు.
మరోవంక, వినేష్ ఫోగట్ అథ్లెటిక్ విజయాల చట్టబద్ధతను ఆయన ప్రశ్నించారు. “ఒక ఆటగాడు రెండు వెయిట్ కేటగిరీల్లో ఒకే రోజులో ట్రయల్స్ ఇవ్వగలడా? అని నేను వినేష్ ఫోగట్‌ని అడగాలనుకుంటున్నాను. వెయిట్-ఇన్ తర్వాత ఈ ట్రయల్స్‌ను ఐదు గంటల పాటు పాజ్ చేయవచ్చా? నువ్వు మోసం చేసి అక్కడికి వెళ్లావు.నీ చర్యలకు దేవుడు నిన్ను శిక్షించాడు కాబట్టి నువ్వు ఏ పతకం సాధించలేదు” అని బ్రీజ్ భూషణ్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బజరంగ్ పునియా తనకు అవసరమైన ట్రయల్స్‌ను పూర్తి చేయకుండానే ఆసియా క్రీడల్లో పాల్గొన్నారని, కాంగ్రెస్ తమ రాజకీయ ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ అథ్లెట్లను ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. ‘నేను మహిళలను అవమానించలేదు, కాంగ్రెస్ చేసింది. అమ్మాయిలను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నది,” అన్నారాయన.
“ఒక రోజు, ఆరోపించిన సంఘటనలు జరిగినప్పుడు నేను ఢిల్లీలో లేనని కోర్టు తీర్పు రుజువు చేస్తుంది. ఒక ఆరోపణ చేస్తున్న సమయంలో నేను సెర్బియాలో ఉన్నాను. మిగిలిన రెండింటికి, నేను లక్నోలో ఉన్నాను. వాస్తవం స్పష్టంగా ఉంది, ప్రజలే నిర్ణయిస్తారు” అంటూ ఆ కేసులలో తాను నిర్దోషిగా బైటకు వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు