వరద సహాయక చర్యలను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెను ముప్పు తప్పింది. విజయవాడలోని మధురానగర్ వద్ద రైల్వే ట్రాక్‌పై సీఎం చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై చంద్రబాబు ఉండగానే రైలు వచ్చింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై రైల్వే ట్రాక్ అవతలి పక్కకు తీసుకెళ్లారు. రైలు వెళ్లిన తర్వాత చంద్రబాబు పర్యటన కొనసాగింది.
మధురానగర్‌లో వరద ముంపులో చిక్కుకున్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ వరద పరిస్థితులను పరిశీలించేందుకు రైల్వే బ్రిడ్జిపైకి ఎక్కారు. ఆ వంతెనపై నడుస్తూ బుడమేరు ఉద్ధృతిని చంద్రబాబు పర్యవేక్షించారు. అయితే ఆయన భద్రతా సిబ్బంది వద్దని చెబుతున్నప్పటికీ వినకుండా చంద్రబాబు బ్రిడ్జిపై కొంత దూరం వెళ్లారు.
అదే సమయంలో బ్రిడ్జిపై వెళ్తుండగా ఎదురుగా రైలు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును రైల్వే బ్రిడ్జిపై పక్కకు తీసుకెళ్లారు. రైల్వే బ్రిడ్జిపై పట్టాలకు ఒక పక్క నిలబడిన చంద్రబాబుకు అతి సమీపం నుంచి దూసుకెళ్లింది. దీంతో చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది.
ఆ తర్వాత రైలు వెళ్లిపోయిన తర్వాత అధికారులు, భద్రతా సిబ్బంది చంద్రబాబును బయటికి తీసుకువచ్చారు. భారీ ప్రమాదం నుంచి బయటపడటంతో వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.

More Stories
పండుగ తరహాలో తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
పరకామణి కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు