వైద్యురాలి హత్యను కప్పిపుచ్చేందుకై దిలీప్ ఘోష్ యత్నం!

వైద్యురాలి హత్యను కప్పిపుచ్చేందుకై దిలీప్ ఘోష్ యత్నం!
* ఓ పోలీస్ అధికారి లంచం ఇవ్వజూపారని తల్లితండ్రుల ఆరోపణ
కోల్‌కతాలోని ఆర్‌జీ ఖర్‌ ఆసుపత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనలో అప్పటి ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ సాక్ష్యాధారాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలిపి ఓ లేఖ బయటపడింది. ఆగస్టు 10న లేఖలో నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో మరమ్మతులు చేయాలని ఆదేశించడంతో సాక్ష్యాలను తారుమారు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బిజెపి నాయకుడు సుకాంత మజుందార్ వెల్లడించిన ఈ లేఖ నేరస్థలంలో జోక్యం చేసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. “ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ డైరెక్టర్ సందీప్ ఘోష్ సంతకం చేసిన ఆర్డర్, బాధితుడు మరణించిన ఒక రోజు తర్వాత ఆగస్టు 10 నాటిది. క్రైమ్ సీన్‌ను ట్యాంపరింగ్ చేయడం గురించి సహోద్యోగులు, నిరసనకారుల నుండి ఆరోపణలు వచ్చినప్పటికీ, పోలీసు కమిషనర్ దానిని తిరస్కరించారు, ”అని మజుందార్ తన పోస్ట్‌లో రాశారు.
వైద్యుల గదులు, మరుగుదొడ్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ వివిధ విభాగాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు లేఖ వ్రాసారు. మెరుగైన సౌకర్యాల కోసం రెసిడెంట్ డాక్టర్ల డిమాండ్లను ఘోష్ మెమో ఉదహరించారు. కాగా, ఆ రెండు రోజులలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాల్ జాబితాను తీసుకొంటే ఆధారాలు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన అసలు దోషులు బైటపడతారని ప్రతిపక్ష నేత సువెందు అధికారి స్పష్టం చేశారు.
ఆ వైద్యురాలి మృతదేహం కనుగొన్న సెమినార్ హాల్ లోనే అత్యాచారం, హత్య జరిగి ఉండకపోవచ్చని, కాలేజీలోనే మరోచోట జరిపి అక్కడ పడవేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో ఇటువంటి నిర్మాణాలు చేపట్టడం ఆధారాలు తుడిచివేసేందుకే అని స్పష్టం అవుతుంది. ఇప్పటి వరకు కాలేజీలో చాలారోజులుగా మరమత్తులు జరుగుతున్నాయని అంటూ చెబుతూ వచ్చారు.

మరోవంక, ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని తెలిపారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు.

వైద్యురాలిపై హత్యాచార ఘటనకు కోల్‌కతాలో జరిగిన ఆందోళనల్లో బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొంటూ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. “పోలీసులు మొదటి నుంచి మా కుమార్తె హత్యాచార కేసును మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారు. తొలుత మా కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు అనుమతించలేదు. పోస్టుమార్టం పరీక్షలు పూర్తయ్యేంతవరకు పోలీస్‌ స్టేషన్లోనే వేచి ఉండేలా చేశారు” అని తెలిపారు.

“కుమార్తె మృతదేహాన్ని మాకు అప్పగించినప్పుడు సీనియర్ పోలీసు అధికారి ఒకరు లంచం ఇవ్వజూపారు. మేము అందుకు తిరస్కరించాం. మా కుమార్తెకు న్యాయం చేయాలని పోరాడుతున్న జూనియర్‌ వైద్యులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నాం” అని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు.

ఈ కేసుపై తొలుత కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, దర్యాప్తు సమయంలో వారు వ్యవహరించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు సంజయ్‌రాయ్‌ సహా ఘటన జరిగిన ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌, మరికొందరికి పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు.

తమ కుమార్తెకు న్యాయం చేయాలని బుధవారం తొలిసారి నిరసనలో పాల్గొన్న సందర్భంగా మృతురాలి కుటుంబీకులు ఈ ఆరోపణలు చేశారు. మృతురాలి తండ్రి మాట్లాడుతూ నిరసనల్లో నిరసనల్లో పాల్గొనాలని పలువురు కోరారని, తాము ఇంకా ఏం చేస్తామని ప్రశ్నింఛాయారు. ఘటనను సహించేది లేదని పేర్కొంటూ తమకు చాలా ప్రశ్నలు ఉన్నాయనీ, వాటన్నింటిని పోలీసులను అడుగుతామని స్పష్టం చేశారు.
 
ఘటన జరిగిన రోజున రాత్రి కుమార్తె మృతదేహాన్ని దహన సంస్కరాల కోసం తీసుకెళ్లాలని ఒత్తిడి చేశారని, ఎలాంటి విచారణ లేకుండానే ఆత్మహత్య చేసుకుందని చెప్పారని ఆయన ఆరోపించారు. హాస్పిటల్‌కు తాము 12.10 గంటలకు చేరుకుంటే, కూతురి ముఖం చూపించేందుకు తమను సెమినార్‌ హాల్‌ బయటే మూడుగంటల పాటు కూర్చుండబెట్టారని, మృతదేహాన్ని చూసేందుకు అనుమతించలేదని, పోస్టుమార్టం కోసం తీసుకెళ్లే వరకు పోలీస్‌స్టేషన్‌లో నిరీక్షించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఆ తర్వాత నిస్సహాయ స్థితిలో ఒత్తిడికి లోనయ్యామని, ఇంటికి వచ్చే సరికి 400 మంది పోలీసులు ఉన్నారని, మరో మార్గం లేక మృతదేహానికి దహన సంస్కారాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ రోజున దహన సంస్కారాలకు ఖర్చు ఎవరు భరించారనే విషయం ఇప్పటికీ తనకు తెలియదని చెప్పుకొచ్చారు.