వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణకు కలిపి విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ.3,448 కోట్లను కేంద్రం కేటాయించింది. తక్షణ సాయం కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. తక్షణ సహాయం అందించడానికి ప్రక్రియ జరుగుతోందని, ఈ నిధుల్లో కేంద్రం వాటా కూడా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో సంభవించిన వరదల సహాయ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలపై వరదలు ప్రభావం చూపగా.. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, కామారెడ్డి జిల్లాలపై ప్రభావం చూపాయి. పదులు సంఖ్యలో ప్రాణాలు వరదల్లో కలిసిపోయాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు రోజులుగా పర్యటించారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కేంద్రమంత్రితో కలిసి పర్యటించారు. పంటనష్టం, ఆస్తి నష్టం జరిగిన ప్రాంతాలను పర్యటించారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం హైదరాబాద్‌లోని సచివాలయానికి వెళ్లారు. వరద సహాయక చర్యలపై చర్చించేందుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
కాగా ఇప్పటికే కేంద్ర హోం శాఖ రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొందని పేర్కొంటూ తెలుగు రాష్ట్రాలకు అందజేసిన వరద సాయం గురించి హోం శాఖ శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందజేశామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అవసరమైన పూర్తి సహకారం అందజేస్తోన్నామని స్పష్టం చేసింది.
వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ భద్రతను అంచనా వేయడానికి, వరద నుంచి తక్షణ ఉపశమనం కోసం సిఫార్సు చేయడానికి కేంద్ర నిపుణుల బృందాన్ని విజయవాడకు పంపించామని వెల్లడించింది. వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి హోం శాఖ ఆధ్వర్యంలో ఇంటర్-మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ని ఏర్పాటు చేశామని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎఫ్‌కి చెందిన 26 బృందాలు, వైమానిక దళానికి చెందిన 8 హెలికాప్టర్లు, నౌకా దళానికి చెందిన 3 హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ పాల్గొన్నాయని కేంద్ర హోం శాఖ ప్రకటన చేసింది. తెలంగాణలో సహాయ, పునరావాస కార్యకలాపాల కోసం 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 వైమానిక దళాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు 350 మందిని రక్షించాయని, 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయని, తెలంగాణలో 68 మందిని రక్షించి 3200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు చిగురటాకులా వణికాయి. తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం