వరద బాధితులకు పవన్ కల్యాణ్ రూ.6 కోట్ల విరాళం

బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులుగా అతి భారీ వర్షపాతం నమోదైంది. వరదలు పోటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. తాజా పరిణామాల నేపథ్యంలో సినీతారలు ముందుకొచ్చి తమవంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే నటులు జూనియర్​ ఎన్టీఆర్, విశ్వక్​సేన్, సిద్ధు జొన్నలగడ్డ తమ వంతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​కు విరాళం ప్రకటించారు.

 సినీ నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ.6 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ.కోటి చొప్పున పవన్‌ విరాళం ప్రకటించారు. ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు ఇవ్వనున్నారు. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించారు.

వరద ప్రాంతాల్లో తానూ పర్యటించాలని అనుకున్నానని, కానీ తన వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావిస్తున్నానని చెప్పారు. తన పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదని తెలిపారు. తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదని, విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని వెల్లడించారు

 తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం నందమూరి బాలకృష్ణ, తారక్ రామారావు, చిరంజీవి, నాగార్జున తెలంగాణ, ఏపీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున ఒకొక్కరు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. తమ బాధ్యతగా బాధితుల సహాయార్థం విరాళం అందిస్తున్నట్లు వారు తెలిపారు. “ ఏపీలో దాదాపు 380 పంచాయతీలు దెబ్బతిన్నాయి. నా శాఖ కాబట్టి, నేను నిన్న ఇచ్చిన కోటి రూపాయలు మాత్రమే కాకుండా 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పారు.

“గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల హైదారాబాద్ అయినా.. ఇక్కడ బుడమేరు అయినా సరే పరీవాహక ప్రాంతాల్లో అనుమతులు ఇవ్వడం వలన జరుగుతున్న నష్టం ఇది. హైడ్రా లాంటిది రాకముందే సంబంధిత శాఖలు పూర్తిస్థాయిలో పనిచేస్తే ఇలా జరిగేది కాదు. హైడ్రా లాంటి వ్యవస్థ ఒక్కటే సరిపోదు, లే అవుట్లు చేసేముందు… వాటిని కొనే ముందు, వారికి అనుమతులు ఇచ్చేముందు ప్రతిఒక్కరూ ఆలోచించాలి. అక్రమంగా నిర్మిస్తున్న భవనాల్లో లక్షల రూపాయలతో ఫ్లాట్లు కొనడం తరవాత ప్రభుత్వం వాటిని కూలగొట్టడం కంటే ముందే ఆలోచించాలి” అని పవన్ కల్యాణ్ హితవు చెప్పారు.

“కొల్లేరు, బుడమేరు అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు ఉన్నాయి. వాటిపై చర్యలు తీసుకుంటే కులాల గర్ధన, ఆర్థిక గొడవలు, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి. అందుకే వాటిపై మొండిగా కాకుండా సామరస్యంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం అనుకుంటుంది” అని తెలిపారు. 

“గత ప్రభుత్వం స్థలాలు ఇస్తున్నాం అని చెప్పి ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారు. జగనన్న కాలనీలు అన్ని కూడా ముంపు ప్రాంతాల్లో ఇచ్చారు. ఇది సరికాదు. ముంపు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా లే అవుట్లు వేసి ఇలాంటి విపత్కర పరిస్థితులకు అవకాశం ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.